రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం
దిశ, ఏపీ బ్యూరో: రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన తరువాత ఇంటింటి సర్వే ద్వారా అనర్హుల రేషన్ కార్డులు తొలగించిన సంగతి తెలిసిందే. అనంతరం కొత్త రేషన్ కార్డుల జారీ, కార్డుల్లో మార్పులను గత కొన్ని నెలలుగా నిలిపివేసింది. దీంతో అర్హులు కూడా రేషన్‌కు దూరమయ్యారు. ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా ఈ ప్రక్రియపై ప్రభుత్వం ఆదేశాలు […]
దిశ, ఏపీ బ్యూరో: రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన తరువాత ఇంటింటి సర్వే ద్వారా అనర్హుల రేషన్ కార్డులు తొలగించిన సంగతి తెలిసిందే. అనంతరం కొత్త రేషన్ కార్డుల జారీ, కార్డుల్లో మార్పులను గత కొన్ని నెలలుగా నిలిపివేసింది. దీంతో అర్హులు కూడా రేషన్‌కు దూరమయ్యారు.
ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా ఈ ప్రక్రియపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేసేందుకు, ఇప్పటి వరకు రేషన్ కార్డుల్లో చేరని వారిని చేర్చుకునేందుకు వీలుగా మార్పులు, చేర్పులకు అవకాశం ఇచ్చింది. దీంతో కొత్తగా వివాహమైన దంపతులు, కొత్తగా జన్మించిన పిల్లలను రేషన్ కార్డుల్లో జతచేసే వెసులుబాటు కల్పించింది.
రేషన్ కార్డు స్థానంలో మూడు కార్డులను ప్రవేశపెట్టింది. ఈ మేరకు కుటుంబ వార్షిక ఆదాయాన్ని బట్టి బియ్యం కార్డు, వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు, సామాజిక పింఛన్ కార్డు ఇలా వేర్వేరుగా జారీ చేస్తోంది. బియ్యం కార్డు తప్ప మిగిలిన వాటిని ఇప్పటికే అందజేసింది. బియ్యం కార్డులను కూడా చాలా వరకు సిద్ధం చేశారు. కొంతమందికి సరఫరా కూడా చేశారు. కానీ కరోనా నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ పాత రేషన్ కార్డులపైనే బియ్యం అందిస్తోంది.
ఆధార్‌తో పాన్, బ్యాంక్ అకౌంట్‌ను జతచేయడంతో ఆధార్ కార్డును ఇస్తే చాలు ఇతర వివరాలన్నీ కంప్యూటర్‌లో ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో రేషన్ కార్డుకు అర్హులా? కాదా? అన్న క్లారిటీ వచ్చేస్తోంది. వ్యవసాయ ప్రధానంగా ఉన్నవారిలో కూడా పంట అమ్మకాలు బ్యాంక్ అకౌంట్ ద్వారా సాగించడంతో రికార్డులను చూసి రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. అర్హులు తమ ఆధార్ వివరాలతో అప్లికేషన్ రెవెన్యూ అధికారులకు అందజేయడం ద్వారా రేషన్ కార్డు పొందవచ్చని చెబుతున్నారు.
కొత్త కార్డుల్లో చేరాలనుకున్న వారైనా, ఇతర ప్రాంతాల్లో వలస ఉన్న వారు అక్కడ రేషన్‌కార్డు పొందాలనుకుంటే ఇక్కడ కార్డులో పేర్లను తొలగించుకోవాలి. కొత్తగా రేషన్‌కార్డు కావాలనుకొనే వారంతా తప్పనిసరిగా ప్రజాసాధికార సర్వేలో నమోదు చేసుకోవాలి. అలా అయితేనే రేషన్ కార్డుల్లో నమోదు చేస్తారు. వివాహమైన వారు వారి కుటుంబం నుంచి విడివడి కొత్త కుటుంబంగా నమోదైతేనే కొత్త కార్డు వచ్చే వెసులుబాటు ఉంది. అయితే ప్రస్తుతం మార్పులు, చేర్పులకే అవకాశం ఉంది. కొత్త కార్డులకు అవకాశం కనిపించడం లేదు.