నేడు చలో మంథని.. బీజేపీ లీగల్ సెల్ పిలుపు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మంథని న్యాయవాది దంపతులు వామనరావు, నాగమణిల జంట హత్యపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకోవాలని భావిస్తోంది. మంథని స్థానిక సమస్యలు, ఇసుక మాఫియా, అధికార పార్టీకి చెందిన నాయకుల ఆగడాలపై సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి హత్యకు గురైన వామనరావు కుటుంబ సభ్యులకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలనుకుంటోంది. ఇదే విషయమై బీజేపీ ముఖ్యనేతలతో పార్టీ కార్యాలయంలో శనివారం అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశమయ్యారు. బీజేపీ […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మంథని న్యాయవాది దంపతులు వామనరావు, నాగమణిల జంట హత్యపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకోవాలని భావిస్తోంది. మంథని స్థానిక సమస్యలు, ఇసుక మాఫియా, అధికార పార్టీకి చెందిన నాయకుల ఆగడాలపై సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి హత్యకు గురైన వామనరావు కుటుంబ సభ్యులకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలనుకుంటోంది. ఇదే విషయమై బీజేపీ ముఖ్యనేతలతో పార్టీ కార్యాలయంలో శనివారం అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశమయ్యారు. బీజేపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఆదివారం 200 మంది న్యాయవాదులు, పార్టీ ముఖ్య నేతలతో మంథని వెళ్లాలని నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్ర కార్యాలయం నుంచి 4 ప్రత్యేక బస్సులను ఆపార్టీ నాయకత్వం ఏర్పాటు చేస్తోంది.
చలో మంథని ప్రోగ్రాంలో భాగంగా వామనరావు కుటుంబీకులను బీజేపీ న్యాయవాదుల బృందం, నాయకులు పరామర్శించనున్నారు. లాయర్ల హత్యలో పెద్దపల్లి జెడ్పీ చైర్మెన్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు హస్తముందని వార్తలొస్తుండడంతో అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేలా బీజేపీ చలో మంథని కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. రాజకీయంగా వామనరావు కుటుంబానికి భరోసానివ్వడం ద్వారా పోలీసు యంత్రాంగంపై ఒత్తిడి పెంచవచ్చని భావిస్తోంది. ఇసుక మాఫియా, కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలకు సంబంధించిన అంశాలతో కూడా ఈ కేసు ముడిపడి ఉన్నందున రాజకీయంగా అధికార పార్టీపై వత్తిడి తేవచ్చనుకుంటోంది.
మీడియాపై పుట్ట మధు ఫైర్..
ఇన్వెస్టిగేషన్ మీడియా చేయాలా? పోలీసులు చేయాలో ఆలోచించుకోవాలని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. మంథని నియోజకవర్గంలో టీఆర్ఎస్ సభ్యత్వ సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుట్ట మధు మట్లాడుతూ.. మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ కొన్ని టీవీలు, పత్రికల్లో ఇష్టం వచ్చినట్లు కథనాలు రాస్తున్నారని ఆరోపించారు. కొన్ని సంస్థలు మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు అమ్ముడు పోయి బీసీ బిడ్డనైన తనను టార్గెట్ చేశాయని ఆరోపించారు. త్వరలో హైదరాబాద్ లో మీటింగ్ ఏర్పాటు చేసి మీడియా బండారం అంతా బయటపెడతానని స్పష్టం చేశారు. మీడియాను చూస్తే అసహ్యం వేస్తోందన్నారు. నేను వజ్రాన్ని, మోసగాన్ని కాదని స్పష్టం చేశారు.