అగ్రి మార్కెట్లో రాజీనామాల పర్వం.. చైర్మన్ VS డైరెక్టర్లు!
దిశ, వరంగల్ తూర్పు : ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్ద వ్యవసాయ మార్కెట్‌గా పేరుగాంచిన వరంగల్ అర్బన్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ముసలం మొదలైంది. అందరినీ ముందుండి నడిపించాల్సిన చైర్మన్ ఒంటెద్దు పోకడలకు విసుగు చెందిన డైరెక్టర్లు రాజీనామాలకు సైతం సిద్ధపడ్డారు. తమ మాట చెల్లని చోట తాము ఉండి ప్రయోజమేమిటని ప్రశ్నిస్తున్నారు. అందుకే రాజీనామా చేసేందుకు సిద్ధం అంటూ ఆరుగురు డైరెక్టర్లు బాహాటంగా ప్రకటిస్తున్నారు. 11మందితో కమిటీ.. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ చైర్మన్‌గా చింతం […]
దిశ, వరంగల్ తూర్పు : ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్ద వ్యవసాయ మార్కెట్‌గా పేరుగాంచిన వరంగల్ అర్బన్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ముసలం మొదలైంది. అందరినీ ముందుండి నడిపించాల్సిన చైర్మన్ ఒంటెద్దు పోకడలకు విసుగు చెందిన డైరెక్టర్లు రాజీనామాలకు సైతం సిద్ధపడ్డారు. తమ మాట చెల్లని చోట తాము ఉండి ప్రయోజమేమిటని ప్రశ్నిస్తున్నారు. అందుకే రాజీనామా చేసేందుకు సిద్ధం అంటూ ఆరుగురు డైరెక్టర్లు బాహాటంగా ప్రకటిస్తున్నారు.
11మందితో కమిటీ..
ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ చైర్మన్‌గా చింతం సదానందం, వైస్ చైర్మన్‌గా రామ్‌గోపాల్ రెడ్డితో పాటు మరో ఎనిమిది మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు నామినేషన్ పద్ధతిలో మరో డైరెక్టర్‌ను నియమిస్తారు. దీంతో మొత్తం 11 మందితో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గంగా వ్యవహరిస్తారు. మార్కెట్‌లో ఎలాంటి అభివృద్ధి చేయాలన్నా మరే ఇతర నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ పాలకవర్గానిదే కీలక బాధ్యత.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న చైర్మన్..
ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతం సదానందం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ డైరెక్టర్లు బాహాటంగా విమర్శిస్తున్నారు. తన ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారంటూ మండిపడుతున్నారు. మార్కెట్‌లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా తమను పట్టించుకోవడం లేదని, కనీసం తమ దృష్టికి కూడా రాకుండానే పనులు జరిగిపోతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ మంత్రి వచ్చిన సమయంలోనైనా ప్రొటోకాల్ ప్రకారం సమాచారం ఇవ్వాలి. కానీ అలాంటిదేమీ లేదని మండిపడుతున్నారు. ప్రతి విషయంలో డైరెక్టర్లను చిన్నచూపు చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిరాశలో డైరెక్టర్లు..
పాలకవర్గంలో డైరెక్టర్లుగా ఉన్నా తమ దృష్టికి రాకుండానే నిర్ణయాలు జరిగిపోవడంపై కొంతమైంది డైరెక్టర్లు నిరాశలో ఉన్నారు. కొంత కాలంగా తమలోతామే కుమిలిపోయారు. తమ మాట చెల్లని చోట ఉండి ప్రయోజనమేంటన్న నిర్ణయానికి వచ్చారు.
తాడోపేడో తేల్చుకునేందుకు..
మార్కెట్ చైర్మన్ ఒంటెద్దు పోకడలతో విసుగెత్తిన డైరెక్టర్లు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. తమ పదవులకు రాజీనామా చేయడమే సమస్యకు పరిష్కారంగా నిర్ణయించుకున్నారు. వైస్ చైర్మన్ రామ్‌గోపాల్ రెడ్డితో పాటు డైరెక్టర్లు రతన్ రావు, వెంకట్‌రావు, సమ్మయ్య, విజయ్‌కుమార్, రఘు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ఉదయం బహిరంగంగా ప్రకటించారు. అందరి పేర్లను ఒక తెల్లకాగితంపై రాసి వాటిని మార్కెట్‌లో అందజేస్తున్నట్లుగా వెల్లడించారు. మధ్యాహ్నంలోగా ఏదో ఒకటి తేల్చుకుంటామంటూ ప్రకటించారు.
ఎమ్మెల్యే చొరవతో ఆగిన రాజీనామాలు..
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చొరవ తీసుకుని వారితో చర్చించడంతో రాజీనామాలకు బ్రేక్ పడింది. నిరాశలో ఉన్న డైరెక్టర్‌లతో ఎమ్మెల్యే పిలిపించుకున్నారు. చైర్మన్‌ను కూడా రావాల్సిందిగా ఆహ్వానం పంపారు. అందరూ సాయంత్రం నాలుగు గంటలకు తనను కలువాలని చెప్పడంతో అందరూ ఎమ్మెల్యేను కలిసినట్లు తెలుస్తోంది. సమస్యలు ఉంటే పరిష్కరించుకుందామని చెప్పినట్లు సమాచారం. రానున్న ఎమ్మెల్సీ, నగర పాలక సంస్థ ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుందని పేర్కొన్నట్లు తెలిసింది. అందరూ కలిసి మార్కెట్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.