కేసీఆర్ కిందికి ‘నీళ్లు..’ తెలంగాణలో మరో ఉద్యమం తప్పదా..?
దిశ, తెలంగాణ బ్యూరో : జల వివాదాల్లో రెండు రాష్ట్రాల జుట్టు కేంద్రం చేతికి చిక్కింది. మరో మూడు నెలల తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల నిర్వహణ, రెండు నదుల్లో నీటి వాటా, వినియోగం, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మొత్తం కేంద్రం పరిధికి వెళ్లనున్నాయి. దీనికి సంబంధించిన గెజిట్‌ను కూడా విడుదల చేసింది. అపెక్స్ కౌన్సిల్లో నిర్ణయం, రాష్ట్ర పునర్వీభజన చట్టాన్ని అనుసరిస్తూ కేంద్రం రాష్ట్రాలకు సమాచారం ఇవ్వకుండానే గెజిట్ జారీ చేసింది. అయితే బోర్డు పరిధికి […]
దిశ, తెలంగాణ బ్యూరో : జల వివాదాల్లో రెండు రాష్ట్రాల జుట్టు కేంద్రం చేతికి చిక్కింది. మరో మూడు నెలల తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల నిర్వహణ, రెండు నదుల్లో నీటి వాటా, వినియోగం, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మొత్తం కేంద్రం పరిధికి వెళ్లనున్నాయి. దీనికి సంబంధించిన గెజిట్‌ను కూడా విడుదల చేసింది. అపెక్స్ కౌన్సిల్లో నిర్ణయం, రాష్ట్ర పునర్వీభజన చట్టాన్ని అనుసరిస్తూ కేంద్రం రాష్ట్రాలకు సమాచారం ఇవ్వకుండానే గెజిట్ జారీ చేసింది. అయితే బోర్డు పరిధికి ప్రాజెక్టులు వెళ్తాయనేది ఊహించిందే అయినప్పటికీ.. చాలా కాలం తర్వాత ఉంటుందని భావించారు. అందుకే తెలంగాణ నుంచి దూకుడు తగ్గించారు. ప్రాజెక్టుల నిర్మాణాలు మందగించాయి. కానీ ఏపీ సీఎం జగన్‌కు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కేంద్రం ప్రాజెక్టులను బోర్డు పరిధికి తీసుకువస్తూ గెజిట్ జారీ చేసింది. ఈ పరిణామాలు తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇచ్చినట్లు మారాయి.
ఏపీ గెలిచింది
జలాల వివాదంలో ప్రస్తుతానికి జగనే గెలిచారు. తెలంగాణ నీటి వృథాను అడ్డుకోండి, లేదా శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్ని కేంద్రం పరిధిలోకి తీసుకోండి అంటూ వ్యూహాత్మకంగానే జగన్ చేసిన డిమాండ్‌ను కేంద్రం తీర్చింది. తెలంగాణ దూకుడికి అడ్డుకట్ట వేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులను ఆయా బోర్డుల పరిధిలోకి తీసుకొచ్చేలా కేంద్ర జలశక్తి శాఖ గెటిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మరోవైపు విద్యుదుత్పత్తి ఆపేయాలంటూ కృష్ణా బోర్డు తెలంగాణ సర్కారుకు ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో జగన్ తాను అనుకున్నది సాధించినట్టయింది.
ముఖ్యంగా నాగార్జునసాగర్‌పై తెలంగాణ పెత్తనానికి చెక్ పెట్టినట్టయింది. రెండు పిల్లులు, రొట్టెముక్క కథగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేరుగా తీసుకెళ్లి జుట్టును కేంద్రం చేతిలో పెట్టారని అభిప్రాయపడుతున్నారు. కేంద్రంతో సఖ్యతగా ఉండే రాష్ట్రానికి బోర్డు నిర్ణయాలు అనుకూలంగా, సఖ్యతగా లేని రాష్ట్రానికి వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉంటుందనేది సహజమే. ప్రస్తుతం ఇష్టమొచ్చినట్టు తెలంగాణ, ఏపీ విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో అవసరాలకు తగ్గట్టు ఎప్పటికప్పుడు సాగర్ నుంచి విద్యుత్ ఉత్పత్తిని మానిటర్ చేసుకుంటోంది. భవిష్యత్తులో ఇది ఇక సాధ్యం కాదు. విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నా కూడా బోర్డుల అనుమతి తీసుకోవాల్సిందే. అంటే పరోక్షంగా కేంద్రం అనుమతి తప్పనిసరి. ఈ విషయంలో కేంద్రం నిర్ణయంలో జాప్యం తలెత్తితే రాష్ట్రాలే ఇబ్బంది పడతాయి. తీవ్ర విద్యుత్ కొరత ఎదుర్కొనే ప్రమాదం కూడా ఉంది.
పెత్తనం కేంద్రానిది… ఖర్చు రాష్ట్రాలది..
రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్ట్‌లపై పెత్తనాన్ని బోర్డులకు దాఖలు చేస్తూ.. పరోక్షంగా పెత్తనాన్ని కేంద్రం చేతుల్లోకి తీసుకుంటోంది. కానీ నిర్వహణను నుంచి ఉద్యోగుల వేతనాల వరకూ ఖర్చుని మాత్రం రాష్ట్రాలపైనే నెట్టేసింది. నిర్వహణ ఖర్చులకు గాను రెండు తెలుగు రాష్ట్రాలు చెరో రూ. 200 కోట్లు సీడ్ మనీ కింద బోర్డ్‌లకు డిపాజిట్ చేయాలని సూచించారు. ఆ తర్వాత అడిగిందే తడవుగా నిర్వహణ ఖర్చులను 15 రోజుల్లోగా జమ చేయాలని స్పష్టం చేసింది.
ఇక ప్రస్తుతం బోర్డుల పరిధిలోకి వెళ్తే ఇరిగేషన్ శాఖలోని 17 వేల మంది వరకు, జల విద్యుత్ ప్రాజెక్టుల్లోని 3 వేల వరకు సిబ్బంది మొత్తం కేంద్రం ఆధీనంలో ఉండనున్నారు. కానీ వారికి వేతనాలు మాత్రం రాష్ట్రాలే చెల్లించాలి. ఉమ్మడి ప్రాజెక్ట్ లు, ఉమ్మడి కాల్వల వద్ద కేంద్ర బలగాలను మోహరించనున్నారు. ఈ ఖర్చు కూడా రాష్ట్రాలదే.
లక్షల కోట్లు వెచ్చించినా..!
గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు లక్ష కోట్లు దాటింది. అటు పాలమూరు–రంగారెడ్డి, డిండి, భక్త రామదాసు వంటి ప్రాజెక్టులకు రూ. 20 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇంత పెట్టినా ఈ ప్రాజెక్టులన్నీ కేంద్రం చేతుల్లోకి వెళ్తున్నాయి. అంటే ఇక నుంచి ప్రాజెక్టును చూడాలనిపించి సీఎం స్థాయిలో వెళ్లినా ముందుగా బోర్డు… అంటే ఒక విధంగా కేంద్రం పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటోంది. లేకుంటే అక్కడి పారా మిలటరీ బలగాలు అడుగు కూడా లోనికి రానీవ్వరు.
ఇక ఉద్యమించాల్సిందే
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి విఘాతంగా తాజా గెజిట్‌ను భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రమే నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశంతో ముడిపడిన ఉద్యమం. కానీ ప్రధానమైన నీళ్లలోనే ఇప్పుడు కేంద్రం గుప్పిట పెట్టుకుంటోంది. ఈ సమయంలో తాజా గెజిట్‌ను సవాల్ చేసేందుకు టీఆర్ఎస్ప్లాన్ మొదలుపెట్టాల్సిన ఆవశ్యకత నెలకొంది. వాస్తవానికి రాష్ట్ర ప్రజల పన్నులు, శ్రమతో నిర్మించిన ప్రాజెక్టులన్నీ కేంద్రం పరిధిలోకి పోవడమంటే రాష్ట్రాల హక్కులను హరించినట్లే.
ఇప్పటి వరకు తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రూపాయి ఇచ్చింది లేదు. ఏపీలో మాత్రం పోలవరానికి భారీగానే నిధులు సమకూర్చారు. ఇప్పుడు ప్రాజెక్టులన్నీ బోర్డుల పరిధిలోకి వెళ్ళడమంటే రాష్ట్రాలకు ఎలాంటి అధికారం ఉండదు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వమే అయినా… వారిపై అజమాయిషీ మాత్రం బోర్డు అధికారులది. దీని ప్రకారం ఇరిగేషన్‌లోని సుమారు 17 వేల మంది, ట్రాన్స్ కో, జెన్ కోలోని 3వేలకు పైగా ఉద్యోగులు ఇకపై బోర్డు పరిధిలోకి వెళ్తారు.
నీళ్ల కోసమే కొట్లాడి రాష్ట్రాన్ని సాధించుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఆ నీళ్లపై పెత్తనం కేంద్రానిదే కావడంతో స్వరాష్ట్రం వచ్చి కూడా ఉపయోగం లేదనేది రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి భావన. దీనిని మళ్లీ మళ్లీ ప్రజా ఉద్యమం ద్వారానే కేంద్రంపై పెత్తనాన్ని తిప్పికొట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదం ఇప్పుడు టీఆర్ఎస్, బీజేపీగా మారనుంది. ఒకవేళ దీనిపై కేంద్రం పట్టుపడితే ఏకంగా సహాయ నిరాకరణకు దిగేందుకు కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.