కేంద్రం ‘ఛాంపియన్స్’ను తీసుకొచ్చింది
దిశ, న్యూస్ బ్యూరో: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్వచనం, ప్రాతిపదిక విషయంలోని నిబంధనలను సవరించి అమలు చేయడానికి వీలు కల్పిస్తూ కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన ప్రాతిపదిక జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఎంఎస్ఎంఈ డెవలప్‌మెంట్ యాక్ట్ 2006లో అమల్లోకి వచ్చిన 14 సంవత్సరాల తర్వాత నిర్వచనంలో సవరణలను 2020 మే 13న ప్రకటించిన ఆత్మనిర్భర భారత్ ప్యాకేజ్‌లో ప్రకటించారు. దాని ప్రకారం సూక్ష్మ […]
దిశ, న్యూస్ బ్యూరో: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్వచనం, ప్రాతిపదిక విషయంలోని నిబంధనలను సవరించి అమలు చేయడానికి వీలు కల్పిస్తూ కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన ప్రాతిపదిక జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఎంఎస్ఎంఈ డెవలప్‌మెంట్ యాక్ట్ 2006లో అమల్లోకి వచ్చిన 14 సంవత్సరాల తర్వాత నిర్వచనంలో సవరణలను 2020 మే 13న ప్రకటించిన ఆత్మనిర్భర భారత్ ప్యాకేజ్‌లో ప్రకటించారు. దాని ప్రకారం సూక్ష్మ తయారీ, సేవల యూనిట్ల నిర్వచనాన్ని రూ.కోటి పెట్టుబడి, రూ.5 కోట్ల టర్నోవర్‌కు పెంచారు. చిన్న యూనిట్ల పరిమితిని రూ.10 కోట్ల పెట్టుబడి, రూ.50 కోట్ల రూపాయల టర్నోవర్‌కు పెంచారు. మీడియం యూనిట్ల పరిమితిని రూ.20 కోట్ల పెట్టుబడికి, రూ.100 కోట్ల రూపాయల టర్నోవర్‌కు పెంచారు. మధ్య తరహా ఎంటర్ ప్రైజెస్‌లకు ప్రస్తుత పెట్టుబడి పరిమితిని రూ.50 కోట్లకు, టర్నోవర్‌ను రూ.250 కోట్లకు కేంద్ర ప్రభుత్వం సవరించింది.
ప్రస్తుత ఎం.ఎస్.ఎం.ఇల నిర్వచనానికి ప్రాతిపదిక 2006 నాటి ఎం.ఎస్.ఎం.ఇ.డి చట్టం ఆధారంగా రూపొందింది. ఇది తయారీ యూనిట్లకు, సేవల యూనిట్లకు వేరు వేరుగా ఉంది. ఇందులో ఆర్థిక పరిమితులకు సంబంధించి తక్కువ పరిమితులు నిర్దేశించి ఉన్నాయి. అప్పటినుంచి ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన మార్పులు వచ్చాయి. 2020 మే 13న ప్రభుత్వం ప్యాకేజ్ ప్రకటించిన తరువాత, ప్రకటించిన సవరణలు మార్కెట్, ధరలకు అనుగుణంగా లేవని ప్రభుత్వానికి పలు విజ్ఞాపనలు అందాయి. ఈ కారణంగా దీనిని తిరిగి ఎగువకు సవరించాలని పలువురు కోరారు. ఈ విజ్ఞాపనలను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి తిరిగి మీడియం యూనిట్నలకు గల పరిమితిని పెంచాలని నిర్ణయించారు. మారిన కాలానికి, వాస్తవస్థితికి అనుగుణంగా దీనిని మార్చాలని నిర్ణయించారు.
వాస్తవిక వర్గీకరణ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు , సులభతర వాణిజ్యాన్ని కల్పించేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. తయారీ, సేవల యూనిట్లకు సంబంధించి కొత్త ఉమ్మడి వర్గీకరణ ఫార్ములాను నోటిఫై చేశారు. ఇప్పుడు తయారీ, సేవల రంగానికి సంబంధించి ఎలాంటి మార్పు లేదు. టర్నోవర్ కు సంబంధించి కొత్త ప్రాతిపదికను చేర్చారు. నూతన నిర్వచనం ఎం.ఎస్.ఎం.ఇల ప్రగతికి, బలోపేతానికి మార్గం సుగమం చేస్తుందని ఆ శాఖ అధికారులు తెలిపారు. ప్రత్యేకించి, ఎగుమతులను టర్నోవర్ లెక్కింపు నుంచి మినహాయించే నిబంధన ఎం.ఎస్.ఎం.ఇలకు ప్రోత్సాహకరంగా ఉండడంతో పాటు, యూనిట్ ప్రయోజనాలు పోతాయన్న భయాలు ఏవీ లేకుండానే మరిన్ని ఎగుమతులు చేయడానికి ఇది ప్రోత్సాహం కల్పిస్తుంది. ఇది దేశ ఎగుమతులను మరింత పెంచడానికి, తద్వారా మరింత ప్రగతి, ఆర్థిక కార్యకలాపాలకు, ఉపాధి కల్పనకు దోహదపడుతుంది. సవివరమైన మార్గదర్శకాలు, మారిన నిర్వచనానికి అనుగుణంగా వర్గీకరణలో మార్పులకు సంబంధించిన వివరణలను ఎం.ఎస్.ఎం.ఇ మంత్రిత్వశాఖ వేరుగా విడుదల చేస్తుంది. ఎం.ఎస్.ఎం.ఇలకు, నూతన ఎంటర్‌ప్రెన్యుయర్లకు మద్దతుగా ఛాంపియన్స్‌పేరుతో (www.champions.gov.in) మద్దతునిచ్చే యంత్రాంగాన్నిఏర్పాటు చేసినట్టు ఎం.ఎస్.ఎం.ఇ శాఖ తెలిపింది. ఆసక్తికల ఎంటర్ ప్రైజ్‌లు, ప్రజలు ఈ ఏర్పాటు ద్వారా ప్రయోజనం పొందవచ్చు, అలాగే తమ సందేహాలు, ఫిర్యాదులను వారికి తెలపవచ్చు. వీరు వాటిని అత్యధిక ప్రాధాన్యతతో పరిష్కరిస్తారు.