బాలు మృతికి ప్రముఖుల సంతాపం
దిశ, వెబ్‌డెస్క్: సంగీత ప్రపంచంలో నిశ్శబ్దం నెలకొంది. భారతీయ సంగీతం తన ముద్దుబిడ్డను కోల్పోయింది. గాన గంధర్వుడు నింగికెగియగా..సంగీత సరాగాలు మూగబోబాయి. రాగం, తానం, పల్లవి కోట్లాది మంది బాలు అభిమానుల వేదనను చూసి కన్నీరు పెట్టుకుంటున్నాయి. బాలు సుమధుర పాట విని ఈర్ష్యపడిన కోయిల కూడా మౌనంగా చూస్తుంది. మీ ప్రాణం మిమ్మల్ని వదిలినా..మీ గానం మా నుంచి వీడదు.. మాతోనే ఉన్నారు..మాతోనే ఉంటారు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు ఆప్తులు. మీరు సాధించని విజయాలు […]
దిశ, వెబ్‌డెస్క్: సంగీత ప్రపంచంలో నిశ్శబ్దం నెలకొంది. భారతీయ సంగీతం తన ముద్దుబిడ్డను కోల్పోయింది. గాన గంధర్వుడు నింగికెగియగా..సంగీత సరాగాలు మూగబోబాయి. రాగం, తానం, పల్లవి కోట్లాది మంది బాలు అభిమానుల వేదనను చూసి కన్నీరు పెట్టుకుంటున్నాయి. బాలు సుమధుర పాట విని ఈర్ష్యపడిన కోయిల కూడా మౌనంగా చూస్తుంది. మీ ప్రాణం మిమ్మల్ని వదిలినా..మీ గానం మా నుంచి వీడదు.. మాతోనే ఉన్నారు..మాతోనే ఉంటారు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు ఆప్తులు.
మీరు సాధించని విజయాలు లేవు..
మీరు గెలుపొందని శిఖరాలు లేవు..
పరిపూర్ణమైన జీవితం
సాఫల్యమైన పుట్టుక..
ప్రియమైన బాలూ
హాయిగా వెళ్లి…మళ్లీ రండి.. మీ గానామృతాన్ని మళ్లీ పరిచయం చేసేందుకు విచ్చేయండి అంటూ గుండె బరువుతో వీడ్కోలు పలుకుతున్నారు. ఆ లెంజెడరీ సింగర్‌తో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు.
బాలు సలహా కెరీర్ మార్చింది : చిరు
ఎస్పీ బాలసుబ్యహ్మణ్యం మరణం భారతీయ సంగీత ప్రపంచానికి చీకటి రోజుగా అభివర్ణించారు మెగాస్టార్ చిరంజీవి. ఇలాంటి మహానుభావుడిని మళ్లీ చూడగలమా అంటే అసాధ్యమే అనిపిస్తుందన్నారు. ఘంటసాల తర్వాత అంతటి గాయకుడు మళ్లీ బాలు అని.. బాలు స్థానాన్ని భర్తీ చేయాలంటే మాత్రం బాలునే మళ్లీ పునర్జన్మ ఎత్తాలన్నారు. నా కెరీర్‌లో, నా విజయంలో సింహభాగం తనదేనన్న చిరు..నా సాంగ్స్ అంత పాపులర్ అవ్వడానికి కారణం అవి పాడిన బాలునే అన్నారు. కెరీర్ తొలినాళ్ల నుంచి అక్కున చేర్చుకున్న తనను అన్నయ్య అని పిలిచేవాడినని..కానీ తర్వాత ఆయన గొప్పతనం తెలుసుకుని మీరు అని పిలిస్తే..మీరు అని పిలిచి నన్ను దూరం చెయ్యకయ్య అనేవారు అని చెప్పాడు. కమర్షియల్ చట్రంలో ఇరుక్కుపోతున్నావు..నీలో ఉన్న మంచి నటుడికి అవకాశం ఇవ్వాలి ఆయన ఇచ్చిన సలహా మేరకేనేమో ఆపద్బాంధవుడు, రుద్రవీణ, స్వయంకృషి లాంటి సినిమాలు చేయగలిగాను అని తెలిపారు. నా పాటలకు సరైన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చే కొద్ది మంది నటుల్లో చిరంజీవి ఒకరు అని బాలు చెప్పడం గొప్ప అవార్డుగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆ మహానుభావుడికి ఏ రకంగా నివాళులు అర్పించగలను..బాలు తను పాడిన పాటల ద్వారా ప్రతిరోజు మన గుండెల్లో ఉంటారు..మన హృదయాల్లో చిరస్థాయిగా మిగిలి ఉంటారన్నారు.
నా ఆరోప్రాణం విడిచిపోయింది: కె. విశ్వనాథ్
భగవంతుడు ఇంత అన్యాయం చేస్తారని అనుకోలేదన్నారు కె. విశ్వనాథ్. బాలు నా సోదరుడే కాదు నా ఆరోప్రాణం అంటూ కన్నీరు పెట్టుకున్నారు. మాటలు రావడం లేదని.. బాలు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
బాలు స్వరానికి భారత్ మొత్తం అభిమానులే : రజినీ
బాలు మీ స్వరం మీ జ్ఞాపకం నాతో ఎప్పటికీ జీవిస్తాయన్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. మీరు చాలా ఏండ్లు నా గొంతుగా ఉన్నారని.. నేను నిజంగా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అని తెలిపారు. బాలు చివరి క్షణం వరకు పోరాడి మనందరినీ విడిచిపెట్టి వెళ్లడం విచారకరమన్నారు. ఆయన మరణం విపరీతమైన బాధను కలిగిస్తుందన్న రజినీ..తన స్వరానికి అభిమాని కానివారు భారతదేశంలో ఎవరూ లేరన్నారు. బాలు మానవత్వమున్న వ్యక్తి అని..ప్రతీ ఒక్కరిపట్ల గౌరవంగా, ప్రేమగా ఉండేవారని తెలిపారు.
ఏడు తరాలకు గుర్తుంటారు: కమల్ హాసన్
బాలు నీ గొంతు నాతో పంచుకున్నందుకు ధన్యుడిని అంటూ వీడ్కోలు పలికారు లోకనాయకుడు కమల్ హాసన్. జీవితకాలంప్రతిభకు తగిన విధంగా ప్రశంసలు, కీర్తి పొందే అవకాశం కొందరు కళాకారులకు మాత్రమే సాధ్యం అవుతుందని..అందులో బాలు ఒకరన్నారు. ఆయన పాడిన పాటలకు తెరమీద నేను కనిపించడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. పలు భాషల్లో నాలుగు తరాలకు చెందిన కథానాయకుల గొంతుగా బాలు ఉన్నారని.. ఆయన చరిత్రను రాబోయే ఏడు తరాలు గుర్తుంచుకుంటాయన్నారు.
సంగీత వారసత్వంలో చిరంజీవులే: సల్మాన్
భారతీయ సంగీత వారసత్వంలో మీరెప్పటికీ జీవిస్తారన్నారు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్. బాలు గురించి ఇలాంటి వార్త వినడం హృదయ విదారకంగా ఉందన్న సల్మాన్..కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మీరు నాకోసం పాడిన ప్రతీ పాటకు ధన్యవాదాలు..దిల్ దీవానా హీరో ప్రేమ్‌ను స్పెషల్‌గా చూపినందుకు థాంక్స్ చెప్పారు.
కనపడరేమో కానీ.. వినిపిస్తారు : వినాయక్
బాలుగారు మనకు కనిపించరేమో కానీ భారతదేశంలో ఏ మూలకు వెళ్లినా వినిపిస్తారన్నారు దర్శకులు వి.వి. వినాయక్. ఎంతో గొప్పగా జరగాల్సిన బాలుగారి అంతిమ యాత్ర..ఎవరికి చివరి చూపు కూడా దక్కకుండా జరగడం తట్టుకోలేకపోతున్నానని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేర్చాలని భవంతున్ని కోరుకుంటున్నానని..ఆయన వారసత్వాన్ని అబ్బాయి చరణ్ ముందుకు తీసుకువెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.
సంగీత ప్రపంచ ఏకచత్రాధిపతి : రాజమౌళి
ఎస్పీ బాలు పాడిన పాటలు మిగిల్చిన అనుభూతులు తరతరాలకీ కొనసాగుతాయన్నారు రాజమౌళి. మహోన్నతమైన ఆ గాత్రానికి భక్తి ప్రపత్తులతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అన్న ఆయన..చాలామంది తమిళ కన్నడ సోదరులు ఆయన తెలుగు వాడంటే ఒప్ప్పుకునేవారు కాదన్నారు. బాలు మావాడు అని గొడవ చేసేవారని గుర్తు చేసుకున్నారు. అన్ని భాషలలోను పాడారు..అందరిచేత మావాడు అనిపించుకున్నారు అని.. ఈ ఘనత ఒక్క బాలు గారికే సాధ్యం అవుతుందన్నారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల సంగీత ప్రపంచాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఏక ఛత్రాధిపత్యంగా పాలించారని.. ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి అద్భుతం జరగలేదని… ఆ ఏలిక మరి రాదన్నారు రాజమౌళి.
అద్భుతం జరుగుతుందని ఆశపడ్డా: దేవి
అద్భుతం జరుగుతుందనే ఆశతో 24 గంటలు నిద్ర కూడా లేకుండా ప్రార్థిస్తూనే ఉన్నట్లు తెలిపారు మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్. ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదన్నారు. మేము చాలా దురదృష్టవంతులం బాలు గారు..మీ లాంటి లెజెండ్‌కు ఫేర్‌వెల్ ఇస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. హృదయం బాధతో నిండిపోయి..మాట్లాడేందుకు పదాలు కూడా రావడం లేదన్న దేవి..బాలు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
దాచుకో స్వామి.. బాలు జాగ్రత్త: నాగ్
బాలు గారి జ్ఞాపకాలు, సంభాషణలు గుర్తుకు వస్తుంటే కన్నీళ్లు వచ్చేస్తున్నాయి అన్నారు నాగార్జున. అన్నమయ్య చిత్రం విడుదల తర్వాత ఆయన నుంచి వచ్చిన కాల్ ఇంకా గుర్తుంది అన్నారు. నా జీవితంలో సమగ్ర భాగం తనదే అన్న నాగ్.. దాచుకో స్వామి మా బాలుని జాగ్రత్తగా దాచుకో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.