'కొవిషీల్డ్'కు అనుమతి
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కరోనా నివారణ టీకా తయారీ కొలిక్కి వచ్చింది. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనికా-సీరం ఇండియా ఇన్‌స్టిట్యూట్ సంయుక్తంగా రూపొందించిన ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్‌కు కేంద్ర డ్రగ్ స్టాండర్ట్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) నిపుణుల బృందం ఆమోదం తెలిపింది. అత్యవసర వినియోగ అవసరాల నిమిత్తం దీనిని వాడవచ్చని స్పష్టం చేసింది. భారత్ బయోటెక్-ఐసీఎంఆర్ సంయుక్త భాగస్వామ్యంతో తయారుకానున్న ‘కొవాగ్జిన్’ విషయంలో మాత్రం మరిన్ని వివరాలు అందాల్సి ఉన్నందున అనుమతి వాయిదా పడింది. దిశ, తెలంగాణ బ్యూరో: నూతన సంవత్సరాది […]
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కరోనా నివారణ టీకా తయారీ కొలిక్కి వచ్చింది. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనికా-సీరం ఇండియా ఇన్‌స్టిట్యూట్ సంయుక్తంగా రూపొందించిన ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్‌కు కేంద్ర డ్రగ్ స్టాండర్ట్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) నిపుణుల బృందం ఆమోదం తెలిపింది. అత్యవసర వినియోగ అవసరాల నిమిత్తం దీనిని వాడవచ్చని స్పష్టం చేసింది. భారత్ బయోటెక్-ఐసీఎంఆర్ సంయుక్త భాగస్వామ్యంతో తయారుకానున్న ‘కొవాగ్జిన్’ విషయంలో మాత్రం మరిన్ని వివరాలు అందాల్సి ఉన్నందున అనుమతి వాయిదా పడింది.
దిశ, తెలంగాణ బ్యూరో: నూతన సంవత్సరాది రోజునే తీపివార్త దేశ ప్రజలకు చేరుకుంది. ఢిల్లీలో సీడీఎస్‌సీఓ, పూణెలోని నేషనల్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్, ఐసీఎంఆర్, ఎయిమ్స్ వైద్యులు శుక్రవారం సుదీర్ఘంగా చర్చించి కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగం కోసం అనుమతించవచ్చని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. కేంద్రం దీనిపై అధికారికంగా ప్రకటన చేసి, పంపిణీకి అనుమతించే అవకాశం ఉంది. బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధనా విభాగం ప్రముఖ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనికా భాగస్వామ్యంతో ‘కొవిషీల్డ్’ పేరుతో వ్యాక్సిన్ తయారుచేయాలని భావించింది. భారత్‌లోని పూణెకు చెందిన సీరమ్ ఇండియా వారితో సాంకేతిక భాగస్వామ్యం కుదుర్చుకుంది. తొలి, రెండో దశ ప్రయోగాలలో వచ్చిన ఫలితాల అధ్యయనం జరిగింది. మూడో దశలో భిన్నమైన తీరులో నిర్వహించిన ప్రయోగాలలో సగటున 70% మేర ఎఫికసీ (సమర్ధత) వచ్చినట్లు సీరమ్ పేర్కొంది. భారత్‌లోనూ జరిగిన ప్రయోగాలు, ఫలితాలను సంస్థలు ఇంటెరిమ్ అనాలసిస్ నివేదికలో వెల్లడించాయి. అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాల్సిందిగా సీడీఎస్‌సీఓకు దరఖాస్తు చేసుకున్నాయి.
అన్ని పరిశీలనల అనంతరం
నిపుణులు ఆయా సంస్థల నివేదికలను పరిశీలించారు. బ్రిటన్ ఫలితాలతో పాటు భారత్‌లో చేసిన క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను కూడా స్టడీ చేశారు. భారత్ బయోటెక్ నిర్వహించిన తీరులో కాకుండా ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనికా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ భిన్నంగా నిర్వహించాయి. రెండు విడతలలో వ్యాక్సిన్ డోస్‌లు ఇచ్చి వాలంటీర్ల ఆరోగ్య పరిస్థితిని అధ్యయనం చేశాయి. తొలి విడతలో రెండు డోస్‌లు, రెండో విడతలో ఒక పూర్తి డోస్, ఒక సగం డోస్ ఇచ్చి వ్యాక్సిన్ సమర్ధతను పరిశీలించాయి. తొలి విడతలో 62% సమర్ధత మాత్రమే వచ్చినా రెండో విడతలో మాత్రం 90% సమర్ధత వచ్చినట్లు సంస్థలు పేర్కొన్నాయి. ఆ ప్రకారం సగటున 70% సమర్ధత నమోదైనట్లు సీడీఎస్‌సీఓకు సమర్పించిన దరఖాస్తులో వివరించాయి. కరోనా పేషెంట్‌కు వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా పూర్తిస్థాయి రక్షణ కలుగుతుందని, ఆసుపత్రిలో ఇన్-పేషెంట్‌గా చేరాల్సిన అవసరాన్ని నివారించవచ్చని పేర్కొన్నాయి. ఢిల్లీలో శుక్రవారం సమావేశమైన సీడీఎస్‌సీఓ నిపుణుల బృందం నివేదికను క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. సాంకేతిక అంశాలను చర్చించి అత్యవసర వినియోగం కోసం ‘కొవిషీల్డ్’ వాడవచ్చన్న నిర్ణయం తీసుకుంది.
భారత్ బయోటెక్ పరిస్థితేంటి.?
హైదరాబాద్ కేంద్రంగా భారత్ బయోటెక్, కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖకు చెందిన ఐసీఎంఆర్ సంయుక్తంగా తయారుచేస్తున్న ‘కొవాగ్జిన్’ వ్యాక్సిన్‌పై కూడా సీడీఎస్‌సీఓ నిపుణుల బృందం శుక్రవారం చర్చించింది. ఆ సంస్థలు దాఖలు చేసిన దరఖాస్తులపై చర్చించింది. వాలంటీర్ల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన వివరాలతో పాటు ఇప్పటివరకు జరిపిన క్లినికల్ ట్రయల్స్ సమర్ధత అంశాలపై కొన్ని ప్రశ్నలను, లోతైన గణాంకాలను బృందం అడిగినట్లు తెలిసింది. ఆ వివరాలను ఈ సమావేశంలో సమర్పించకపోయిన కారణంగా అనుమతి విషయంలో ఈ బృందం ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయిందని సమాచారం. తదుపరి సమావేశంలో ‘కొవాగ్జిన్’పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
వ్యాక్సిన్ అందుబాటులోకి ఎప్పుడు.?
అమెరికాకు చెందిన ఫైజర్-ఎన్‌బయోటెక్ సంస్థలు తయారుచేస్తున్న వ్యాక్సిన్‌కు ఆ దేశంలో అనుమతి లభించినా, ప్రపంచ ఆరోగ్య సంస్థ సమ్మతి లభించినా భారత్‌లో మాత్రం వినియోగించడానికి ఆ సంస్థలు దరఖాస్తు చేసుకోలేదు. దీన్ని మైనస్ 70 సెంటీగ్రేడ్ డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సి ఉన్నందున భారతదేశ వాతావరణంలో సాధ్యం కాదన్న అంచనాతో ఆసక్తి కూడా చూపించలేదు. ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్‌కు కేంద్ర ప్రభుత్వం లాంఛనంగా నిర్ణయం తీసుకుని అధికారిక ప్రకటన చేయడమే తరువాయి. సీరం ఇండియా ఇన్‌స్టిట్యూట్ సీఈఓ ఆదార్ పూనావాలా మాత్రం తక్షణం ఐదు కోట్ల డోస్‌లను అందివ్వగలమని, మార్చి నాటికి పది కోట్ల డోస్‌లను, జూన్ నాటికి 68 కోట్ల డోస్‌లను సరఫరా చేయగలమని ధీమా వ్యక్తం చేశారు. దేశం మొత్తం మీద సుమారు 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో సుమారు రెండున్నర కోట్ల మంది వైద్యారోగ్య సిబ్బంది ఉన్నారు. మిగతా వ్యాక్సిన్లతో పోలిస్తే ‘కొవిషీల్డ్’కు ప్రత్యేకత ఉందని, 2-8 సెంటీగ్రేడ్ డిగ్రీల చల్లదనంలో కూడా నిల్వ చేయవచ్చని, గ్రామీణ ప్రాంతాలకు రవాణా చేయడంలోనూ పెద్దగా ఇబ్బందులు ఉండవని నిపుణుల బృందం అభిప్రాయపడింది. ఇదే ఉష్ణోగ్రతలో దాదాపు ఆరు నెలల పాటు నిల్వ చేసుకోవచ్చని పేర్కొంది. ఇక సామాన్యులకు అందుబాటులో ఉండేలా చౌక ధరలోనే తయారవుతుందని, రెండు డోస్‌లకు కలిపి గరిష్టంగా రూ. 450 కూడా దాటదని సీరం ఇండియా ఇన్‌స్టిట్యూట్ సీఈఓ పూనావాలా ఇటీవల మీడియాకు వివరించారు. ప్రైవేటు ఆసుపత్రులకు పోయినా గరిష్ట స్థాయిలో వెయ్యి రూపాయలకంటే ఎక్కువ ధర ఉండదని పేర్కొన్నారు.