Divya Tyagi: వందేళ్ల ప్రశ్నకు సమాధానం.. ఈ అమ్మాయి బుర్ర మాములుగా లేదుగా!
గణిత శాస్త్రంలో గత వందేళ్లుగా ఓ ప్రశ్న పరిష్కారం లేకుండా ఉండిపోయింది.

దిశ, వెబ్ డెస్క్: గణిత శాస్త్రంలో గత వందేళ్లుగా ఓ ప్రశ్న పరిష్కారం లేకుండా ఉండిపోయింది. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు సైతం దాన్ని సాల్వ్ చేసేందుకు ప్రయత్నించి విఫలయ్యారు. కానీ, తాజాగా భారత సంతతికి చెందిన ఓ అమ్మాయి ఆ ప్రశ్నను పరిష్కారించి.. బ్రిలియంట్ లేడీ అనిపించుకుంది. మరీ వందేళ్లుగా సాల్వ్ కానీ ఆ మ్యాథ్స్ ప్రాబ్లమ్ ఏంటి? సాల్వ్ చేసిన అమ్మాయి ఎవరు? ఇక్కడ తెలుసుకుందాం.
భారత సంతతికి చెందిన దివ్య త్యాగి (Divya tyagi) అనే అమ్మాయి అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చదువుతుంది. ఓ వైపు చదువు కొనసాగిస్తునే మరోవైపు ఆయా అంశాలపై పరిశోధనలూ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే 'కంప్యుటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ (CFD)'లో కటింగ్ ఎడ్జ్ సాంకేతికతతో పలు ప్రయోగాలు చేస్తోంది.
అయితే, పవన విద్యుత్ రంగంలో ఉపయోగించే గాలి మరల అంశంపై బ్రిటిష్ శాస్త్రవేత్త హెర్మన్ గ్లాయెర్ట్ (Hermann Glauert) 1926లో పలు పరిశోధనలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన ఓ నమూనాను సైతం రూపొందించారు. అయితే, గాలి ప్రెషర్ వల్ల టర్బైన్ రోటర్‌పై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఈ ఒత్తిడి వల్ల గాలి మరల బ్లేడ్‌లు ఎలా వంగి ఉంటాయి? వంటి కీలకమైన అంశాలకు పరిష్కారం చూపకుండానే వదిలేశారు. ఈ సమస్య పరిష్కారానికై గత వందేళ్లుగా ఎంతో మంది హేమాహేమీలు ప్రయత్నిస్తునే ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే దివ్యకు గైడ్‌గా ఉన్న ప్రొఫెసర్ స్వెన్ ష్క్మిట్జ్ (Sven Schmitz) గాలి మరల మన్నికను పెంచే అంశంపైన పరిశోధన చేస్తున్నారు. ఈ క్రమంలో కలన గణితానికి సంబంధించిన ఈ సమస్యను పరిష్కరించమని తన విద్యార్థుల్లో నలుగురికి సూచించారు. అందులో దివ్య త్యాగి కూడా ఒకరు. ఇక విమానయాన రంగంలో తన పరిశోధనల్ని కొనసాగిస్తూనే వారంలో 10-15 గంటల అదనపు సమయాన్ని దివ్య ఈ గణిత సమస్య పరిష్కారానికి కేటాయించేది. చివరకు ఈ వందేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ప్రశ్నకు ఫార్ములా కనుక్కోవడంలో సఫలీకృతమైంది. అంతేకాదు, దివ్య చేసిన పరిశోధనలు గాలి మరల రూపకల్పనలో కొత్త మార్గాలకు తెరతీసినట్లయింది.
ఈ పరిశోధనకు సంబంధించిన థీసిస్ 'విండ్ ఎనర్జీ సైన్స్' అనే జర్నల్‌లో ప్రచురితమైంది. 'బెస్ట్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్' థీసిస్‌గానూ ఘనత సాధించింది. అలాగే, దివ్య చేసిన పరిశోధనకు గుర్తింపుగా 'Anthony E. Wolk Award' కూడా దక్కింది. దివ్య చేసిన పరిశోధన, ఆమె ప్రతిభను పెన్సిల్వేనియా యూనివర్సిటీ కొనియాడింది. ఈ పరిశోధనను అటు అమెరికా వ్యాప్తంగా, ఇటు ప్రపంచవ్యాప్తంగా పాఠ్యాంశాల్లో చేర్చితే బాగుంటుందని వర్సిటీ సూచిస్తోంది.