TG DSC 2024: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టెట్ మార్కుల అప్ లోడ్ కు మరో చాన్స్!

తెలంగాణలో డీఎస్సీ ఫలితాలు-2024 విడుదలకు ముందే.. టెట్ మార్కులను అప్లోడ్ చేసుకునే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది.

Update: 2024-09-11 15:37 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో డీఎస్సీ ఫలితాలు-2024 విడుదలకు ముందే.. టెట్ మార్కులను అప్లోడ్ చేసుకునే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది. డీఎస్సీ అభ్యర్థులకు ఈ నెల 12, 13 వ తేదీలలో టెట్ మార్కులను ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

కాగా, తెలంగాణలో టెట్-2024 ఫలితాలు జూన్ 12 వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. మే 20 నుంచి జూన్ 22 వరకు నిర్వహించిన ఈ పరీక్షకు పేపర్-1 లో 85,996 మంది, పేపర్-2 కు 1,50,491 మంది అభ్యర్థులు హాజరు కాగా.. పేపర్-1 లో 57,725 మంది, పేపర్-2 లో 51,443 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. టెట్ మార్కుల అప్డేట్ తర్వాత టీజీ డీఎస్సీలో వచ్చిన మార్కులకు టెట్ మార్కులను కలిపి తుది ఫలితాలను ప్రకటించనున్నారు. అయితే తాజాగా డీఎస్సీ ఫైనల్ కీ విడుదలైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తెలంగాణ విద్యా శాఖ 2, 3 రోజుల్లో డీఎస్సీ ఫలితాలను కూడా వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే డీఎస్సీ మార్కులకు టెట్ మార్కులను కలిపి GRL (General Ranking List) లిస్టును విడుదల చేస్తే, తర్వాత టెట్ వివరాల అప్లోడ్ లో దొర్లిన తప్పులను సవరణ చేసే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే టెట్ వివరాలను అప్ లోడ్ చేసుకునేందుకు.. తెలంగాణ విద్యాశాఖ మరోసారి అభ్యర్థులకు ఈ అవకాశాన్ని కల్పించింది.


Similar News