Why this life? చచ్చేందుకే ఈ బతుకా.?

అందర్నీ ఆగంచేసిపోయే బతుక్కి అర్థమేముందీ.?

Update: 2025-01-08 03:15 GMT

Suicide..

అన్నింటికీ పరిష్కారమా.?

కొడితే చావు.. తిడితే చావు..

నష్టమొస్తే చావు.. ఉద్యోగం రాకపోతే చావు..

ఏంటీ విపరీత ధోరణి.?

Why These Suicides.?

పోయినప్పుడు పదిమంది కన్నీరు పెడితే జీవితానికి అర్ధం.

కానీ.. అందర్నీ ఆగంచేసిపోయే బతుక్కి అర్థమేముందీ.?

Think Before Suicide.!

ఇది రెప్పపాటు జీవితం బాస్.

క్షణకాలంలో జీవితాల్ని ఆగం చేసుకోవద్దు.!

Stop Suicides.. Live Happily..!! 

దిశ‌, ఫీచ‌ర్స్‌

కన్ను తెరిస్తే జననం.. కనులు మూస్తే మరణం. డబ్బున్నవాడూ.. లేనివాడూ.. పెండ్లయినవాళ్లూ.. కాని వాళ్లూ.. అందరూ అక్కడే ఆగిపోతున్నారు. మందలించారని ఒకరు.. మాయ చేశారని ఒకరు.. ఆర్థిక ఇబ్బందులతో ఒకరు.. ఆగ్రహంతో ఇంకొకరు ఇలా పోటీలుపడి సూసైడ్ చేసుకుంటున్నారు. అన్నింటికీ అదొక్కటే పరిష్కారమనుకుంటే ఇక ఈ జీవితమెందుకు.? చచ్చేందుకే బతుకయితే మరీ బతుకులెందుకూ.? బతికి సాధించేదేం లేదా.? చావే సకల సమస్యలకు పరిష్కారమా.? క్షణికావేశంలో చేసే ఒక తప్పు ఎంతమంది జీవితాలను ఛిద్రంచేస్తుంది. ప్రేమతో ఆలోచించు.. సాటి మనిషి పట్ల సేవాగుణంతో ఉండు.! 

ఇదేనా జీవితం.?

అమీన్‌పూర్‌‌లోని సందీప్, కీర్తి భార్యాభర్తలు. ఇద్దరూ ఉన్నత చదువులు చదివినవాళ్లే. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జాబ్స్ చేస్తున్నారు. సంపాదనకు కూడా సమస్యేం లేదు. కూతురుకు మూడేళ్లు. కొడుక్కి పద్నాలుగు నెలలు. మంచి ఉద్యోగాలు.. సరిపోయే సంపాదన.. చిట్టిపొట్టి చిన్న పిల్లలు. ఎంతో హాయిగా బతికేయొచ్చు. కానీ.. వాళ్లకలా అనిపించలేదు. ఇద్దరికిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా ఆత్మహత్య చేసుకోవడం కోసమేనా వరంగల్ నుంచి వచ్చి హైదరాబాద్‌లో సెటిలై.. పెండ్లి చేసుకొని.. పిల్లల్ని కన్నదీ.? కారణాలేవైనా కానీయండీ.. పసి పిల్లల గురించి ఆలోచించకుండా భార్య సూసైడ్ చేసుకోవడం.. భార్య సూసైడ్ చేసుకుందని భర్త సూసైడ్ చేసుకోవడం ఇద్దరివీ అర్థంలేని చావులే. కష్టపడి చదివి.. ఇష్టపడి పెండ్లి చేసుకొని బతికిన క్షణాలన్నీ వృథా అయిపోయాయి. పాపం.. అభంశుభం తెలియని పసి పిల్లల గురించయినా ఆలోచించాల్సింది. ఈ మొత్తం ఎపిసోడ్‌‌లో వాళ్ల గురించి కాకుండా పిల్లల గురించి క్షణమైనా ఆలోచించివుంటే పిల్లలు అనాథలయ్యేవారు కాదు.

ప్రాణం పోతే వస్తుందా.?

సందీప్, కీర్తిలే కాదు. ఆత్మహత్యే శరణ్యం అనుకునేవాళ్లు ప్రతి ఊర్లో.. ప్రతి ఇంట్లోనూ కనిపిస్తున్నారు. మహేశ్‌‌ది భద్రాద్రి జిల్లా మణుగూరు. ఆటోడ్రైవర్‌‌‌గా పనిచేస్తున్నాడు. నైట్ పూట్ ఎక్కడ తిరుగుతున్నవ్.. ఇంటికి లేట్‌‌‌గా వస్తే ఎట్లా అని వాళ్ల నాన్న మందలించాడట. అంతే మనోడు మనసు మీదికి తీసుకున్నాడు. చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంత అన్యాయమైపోయింది చూడండీ. కన్న తండ్రి కొడుకును లేటుగా వస్తే ఎలా అని అడిగే హక్కు కూడా లేదా.? ఆయింతదానికే ఆత్మహత్య చేసుకుంటే ఆ తండ్రి గుండె ఎంత బాధపడాలి.? ఇదిలా ఉంటే జగిత్యాలలో జరిగి ఘటన ఇంకా గమ్మత్తుగా ఉంది. మెట్‌‌పల్లి మండలం వేంపేటకు చెందిన సిద్ధార్థ హైదరాబాద్‌‌లో డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడు. అయితే హాస్టల్ నుంచి పదిహేను రోజుల క్రితం ఊరికి వెళ్లాడట. కాలేజీకి వెళ్లకుండా ఇలా తిని తిరిగితే ఎలా.? అని అన్నారట పేరెంట్స్. అంతే.. సిద్ధార్థ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ చేసుకోవడం వల్ల కాలేజీకి వెళ్లే పని తప్పిందేమో కానీ.. ప్రాణాలైతే తిరిగి రావు కదా.?

ఒత్తిడే కారణం

అతుల్ సుభాష్ కావచ్చు, కాఫీడే యజమాని వీజీ సిద్ధార్థ కావచ్చు, మరో కామన్ మ్యాన్ కావచ్చు. మానసికంగా క్షోభను అనుభవించినవాళ్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నారని అంటున్నారు నిపుణులు. తాజా ప్రేమజంట ఆత్మహత్యనే తీసుకుందాం. శ్రీరామ్, ఆ అమ్మాయి ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి చచ్చేంత ఇష్టం. అదే కొంప ముంచింది. చింటూ అనేవాడు బ్లాక్‌‌మెయిలింగ్ చేస్తే.. చస్తే ఇద్దరం కలిసి చద్దాం అని డిసైడయ్యారు. వాడెక్కడ చెప్తాడో అని భయపడి ఇక చావే మేలనుకున్నారు. కార్లోనే నిప్పంటించుకొని సూసైూడ్ చేసుకున్నారు. వీళ్లు సరే. కానీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పలేదని అనంతపురంలో ఇంటర్ చదివే తిప్పమ్మ ఆత్మహత్య చేసుకుంది చూడండీ.. ఏమనాలి? పాపం.. భూపాలపల్లిలో రూ.200 కిస్తీ డబ్బుల్లేక భార్యాభర్త సూసైడ్ చేసుకున్నారు. వాళ్లదొక కథ. ఇంకా కొందరైతే వీడియో కాల్స్ చేసి.. లేదా ఫేస్‌‌బుక్‌‌లో లైవ్ పెట్టి మరీ సూసైడ్ చేసుకుంటున్నారు. అదేం ఫ్యాషనో ఏమో.?

పురుషులే ఎక్కువ

కరీంనగర్‌‌‌ జిల్లా అల్లీపూర్‌‌ గ్రామానికి చెందిన సునీత పీజీ స్పెషల్ బీఈడీ చదివింది. తనకు జాబ్ ఇవ్వకపోతే ఆత్మహత్యకు అనుమతి ఇవ్వాలని ఇటీవల కలెక్టర్‌‌‌కు అర్జీ పెట్టుకుంది. తనకు ముగ్గురు మానసిక వికలాంగులైన పిల్లలున్నారని, ఉపాధిలేక వారి పోషణ భారంగా మారిందని అర్జీలో పేర్కొన్నదామె. సామూహిక ఆత్మహత్యకు పర్మీషన్ ఇవ్వాలని అర్జీ పెట్టుకోవడం బాధాకరమే. కానీ, ఆత్మహత్యే ఆమె సమస్యకు పరిష్కారం కాదుగా.? దేశంలో ఇలాంటి ఘటనలే ఎక్కువయ్యాయని లెక్కలు చెప్తున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం జాతీయ ఆత్మహత్యల రేటు లక్షకు 12.4. 2024లో అది లక్షకు 9.87కి తగ్గింది. గతంలో రైతులు, కార్మికుల సూసైడ్‌‌‌లు చూస్తే ఇప్పుడేమో ఆరో తరగతి పిల్లాడు కూడా ఆత్మహత్యనే అంటుండు. 2015 నుంచి 2022 వరకు లెక్కలు చూస్తే ప్రతీయేడు దాదాపు 1,01,188 మంది పురుషులు సూసైడ్ చేసుకుంటున్నారు. స్త్రీలు సంఖ్య 43,314గా ఉంది. అంటే మగవారి సూసైడ్ రేట్ 100,000 మందికి 14.2 ఉండగా.. స్త్రీలలో 6.6గా ఉంది.

ఏదీ శాశ్వతం కాదు

ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకునే ముందు ఎన్నో రకాలుగా ఆలోచిస్తాడని ప్రముఖ సైకాలజిస్ట్ వీరేందర్ అంటున్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్నుంచి బయటపడే అవకాశం లేదని బలంగా నమ్మేవాళ్లే సూసైడ్ గురించి ఆలోచిస్తారట. చిన్నదానికీ, పెద్దదానికీ, అయినదానికీ, కానిదానికీ అన్నింటికీ సూసైడే సొల్యూషన్ కాదు కదా. ఇక్కడిదాకా వచ్చారంటే ఎంతో జీవితాన్ని చూసి ఉంటారు. ఇంతకన్నా పెద్ద కష్టాలతో సహవాసం చేసిన అనుభవాలూ ఉంటాయి. ఒక్కోసారి ఏడ్చిన సందర్భాలూ ఉంటాయి. ఇంకెన్నోసార్లు అత్యంత సంతోషంతో నవ్వుకున్న సమయాలూ ఉంటాయి. వీటిలో ఏదీ శాశ్వతం.? ఇవాళ ఉన్న సమస్య రేపూ ఉంటుందా.? ఏమో.. మీ కష్టమే మీకో దారి చూపొచ్చు. మీ ధైర్యమే మిమ్మల్ని విజేతగా నిలబెట్టొచ్చు కదా. ఈ సమస్యలన్నీ జస్ట్ పాసింగ్ క్లౌడ్ లాంటివి. చికెన్ వండలేదని.. చిట్టీ పడలేదని.. బస్సు మిస్సయ్యిందని.. భార్య తిట్టిందని.. బట్టతల వచ్చిందనీ.. పొట్ట బయటకు కనిపిస్తుందని సూసైడ్ చేసుకున్నారనే వార్తలు చూస్తే బాధకన్నా జాలేస్తుంది. అర్థం చేసుకోండి.

ఈ లక్షణాలుంటే జాగ్రత్త

  1. - విపరీతంగా ఆలోచిస్తారు.
  2. - విపరీతంగా ఎమోషనల్ అవుతుంటారు. కొన్నిసార్లు జీరో ఎమోషన్‌‌‌తో ఉంటారు.
  3. - తింటెనేమో ఎక్కువగా తింటారు, లేకపోతే మొత్తమే తినరు.
  4. - పోతే ఎక్కువగా నిద్రపోతారు, లేదంటే అస్సలు పోరు.
  5. - జీవితంలో ఒంటరి అని ఫిక్సవుతారు.
  6. - సమస్యలు చుట్టుముట్టినప్పుడు కుంగిపోతారు.
  7. - పదేపదే నిరాశగా మాట్లాడతారు.
  8. - క్షణికావేశానికి లోనవుతారు.
  9. - నేనెందుకు పనికిరానంటూ బయటకు చెప్తుంటారు.
  10. - అందరికీ దూరంగా ఉంటారు.
  11. - ఫోన్లలో ఆత్మహత్యలు, విషాధ సంఘటనల గురించి శోధిస్తుంటారు.

కౌన్సిలింగ్ అవసరం

ఇలాంటి లక్షణాలతో ఎవరైనా కనిపిస్తే ధైర్యం చెప్పాలి. ప్రతీ సమస్యకు పరిష్కారం ఉందనే నమ్మకం కల్పించాలి. చిన్న పిల్లలు కూడా తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నారు కాబట్టీ.. పిల్లలకు టైమ్ ఇవ్వాలి. వాళ్ల సమస్యలను పంచుకునే ప్రయత్నం చేయాలి. చదువులో ఒత్తిడి పెంచొద్దు. అన్యమనస్కంగా, దిగులుగా కనిపిస్తే అడగాలి. అప్పుడే వాళ్లు ఓపెన్ అవుతారు. అలా కాదు.. ఇలా ఉండాలి.. నీతో అవుతుందని మనసును మార్చడానికి ప్రయత్నించాలి. కౌన్సిలింగ్ కోసం సైకాలజిస్టును సంప్రదించాలి.

ఛాలెంజెస్ ఎదుర్కోలేకే: వీరేందర్ చెన్నోజు, ప్రముఖ సైకాలజిస్ట్

ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని తెలిసినా చాలామంది దాన్నే వెతుక్కుంటున్నారు. పక్కవాళ్లతో పోల్చుకొని మనం అలా లేము కదా అనుకుంటున్నారు. జీవితంలో ఎదురైన ఛాలెంజెస్‌‌ను ఎదుర్కునే ధైర్యం లేకపోవడం వల్లే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. సోషల్ మీడియాలో కొందర్ని చూసి మనం వాళ్లలా ఎందుకులేం అనే భావన పెరిగిపోతోంది. ఆత్మన్యూనతా భావం పెంచుకుంటున్నారు. ఇవన్నీ పెరిగి డిప్రెషన్‌‌‌కు దారితీసి మనమెుందుకూ పనికిరామని సూసైడ్స్ చేసుకుంటున్నారు.

Tags:    

Similar News