Zydus: స్టెర్లింగ్ బయోటెక్‌లో 50% వాటాను కొనుగోలు చేయనున్న జైడస్ లైఫ్‌సైన్సెస్

స్టెర్లింగ్ బయోటెక్‌లో 50 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు దాని సంస్థ పర్ఫెక్ట్ డేతో(Perfect Day Inc) ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు జైడస్ లైఫ్‌ సైన్సెస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది

Update: 2024-08-24 10:46 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: స్టెర్లింగ్ బయోటెక్‌లో 50 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు దాని సంస్థ పర్ఫెక్ట్ డేతో(Perfect Day Inc) ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు జైడస్ లైఫ్‌ సైన్సెస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ డీల్ ఎంత మొత్తానికి కుదిరిందో చెప్పలేదు. ఈ కొనుగోలు ద్వారా స్టెర్లింగ్ బయోటెక్‌లో 50 శాతం వాటా జైడస్ లైఫ్‌సైన్సెస్‌కు లభిస్తుంది. లావాదేవీ తర్వాత, బోర్డు సమాన ప్రాతినిధ్యంతో 50:50 జాయింట్ వెంచర్‌‌గా మారుతుంది.

అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత గ్లోబల్ మార్కెట్లకు అనుగుణంగా పులియబెట్టిన జంతు రహిత ప్రోటీన్‌ను తయారు చేయడానికి జాయింట్‌ వెంచర్‌లో భాగంగా ఒక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. రెండు సంస్థలు ఈ భాగస్వామ్యం ద్వారా అధిక-నాణ్యత, పర్యావరణ అనుకూల ప్రోటీన్ ఉత్పత్తుల ఉత్పత్తిని వేగవంతం చేయడం, పోషకాహారానికి పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్‌ను తీర్చడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రస్తుతం, స్టెర్లింగ్ బయోటెక్ కిణ్వ ప్రక్రియ ఆధారిత API ఉత్పత్తులు, జెలటిన్ తయారీ, విక్రయాలను చేస్తుంది.

జైడస్ లైఫ్‌ సైన్సెస్ ఎండీ షర్విల్ పటేల్ మాట్లాడుతూ, అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లో పర్ఫెక్ట్ డే వృద్ధి వ్యూహంలో భాగంగా భారతదేశంలో దాని సాంకేతిక సామర్థ్యాలను మెరుగుపరచడానికి సిద్ధంగా ఉంది, జైడస్ దాని బలమైన తయారీ, వాణిజ్య నైపుణ్యాన్ని స్టెర్లింగ్ బయోటెక్‌‌తో కలిసి కొనసాగిస్తామని అన్నారు. ఈ జాయింట్ వెంచర్ ద్వారా రెండు సంస్థలు ఒకరి నైపుణ్యం నుండి మరొకరు ప్రయోజనం పొందేలా చేస్తుందని నమ్ముతున్నామని పర్ఫెక్ట్ డే తాత్కాలిక సీఈఓ నారాయణ్ తెలిపారు.


Similar News