Zomato: రూ. 20 లక్షలు ఇచ్చి ఉద్యోగంలో చేరండి.. జొమాటో సీఈఓ వింత జాబ్ ఆఫర్
ఉద్యోగం కోసం వచ్చే అభ్యర్థే తిరిగి కంపెనీకి ఫీజు రూపంలో రూ. 20 లక్షలు ఇవ్వాలని షరతు
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో సీఈఓ దీపింద గోయల్ వింత జాబ్ ఆఫర్ చేశారు. చీఫ్ ఆఫ్ స్టాఫ్ పొజిషన్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పిన దీపిందర్ అందుకు మొదటి ఏడాదికి జీతం చెల్లించనని చెప్పారు. అంతేకాకుండా ఉద్యోగం కోసం వచ్చే అభ్యర్థే తిరిగి కంపెనీకి ఫీజు రూపంలో రూ. 20 లక్షలు ఇవ్వాలని షరతు విధించడం గమనార్హం. దీనికి సంబంధించి ఎక్స్‌లో పోస్ట్ చేసిన దీపిందర్ గోయల్.. ఈ ఉద్యోగానికి అప్లై చేసే వ్యక్తి గురుగ్రామ్‌లో ఉన్న జొమాటొ హెడ్ ఆఫీస్‌లో పనిచేయాలి. కొత్తగా నేర్చుకునేందుకు, జీవితంలో ఎదిగేందుకు సంకల్పం ఉన్నవారు దరఖాస్తు చేసుకొవచ్చని ట్వీట్ చేశారు. ఈ ఉద్యోగానికి అనుభవం అక్కరలేదని, వినూత్నంగా ఆలోచించేవారు ఇందుకు అర్హులని స్పష్టం చేశారు. అలాగే, ఈ ఉద్యోగంలో ఎంపికైన తర్వాత జొమాటోతో పాటు బ్లింక్ఇట్, జొమాటో ఫీడింగ్ ఇండియా ఎన్‌జీఓ, హైపర్‌ప్యూర్ కంపెనీల కోసం పనిచేయాలి. మొదటి ఏడాదికి వారికి ఎటువంటి జీతం ఉండదని, అభ్యర్థే రూ. 20 లక్షలు ఫీడింగ్ ఇండియాకు విరాళమివ్వాలని పేర్కొన్నారు. ఒకవేళ ఉద్యోగి అడిగితే జొమాటో కూడా ఎన్‌జీఓకు రూ. 50 లక్షలు డొనెట్ చేస్తుందన్నారు. అయితే, రెండో ఏడాది నుంచి రూ. 50 లక్షల కంటే ఎక్కువ జీతం ఇస్తామని దీపిందర్ గోయల్ చెప్పడం విశేషం. ఇదే సమయంలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసేవారు సాధారణ రెజ్యుమే ఇవ్వొద్దని, 200 పదాల్లో తమ అర్హత గురించి తెలియజేయాలన్నారు.