Zomato: పేటీఎం ఎంటర్‌టైన్‌మెంట్ విభాగాన్ని కొనుగోలు చేసిన జొమాటో
ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో కంపెనీ పేటీఎం సంస్థకు చెందిన ఎంటర్‌టైన్‌మెంట్, క్రీడలు, ఈవెంట్‌లు కండక్ట్ చేసే విభాగాలను కొనుగోలు చేసింది. మొత్తం రూ. 2,048 కోట్లకు ఈ ఒప్పందం పూర్తయినట్లు రెండు కంపెనీలు ఎక్స్ఛేంజీలకు తెలియజేశాయి. ఈ డీల్ కింద, జొమాటో సినిమా టిక్కెట్‌ల వ్యాపారంలో ఉన్న పేటీఎం అనుబంధ సంస్థలు ఓర్బ్‌జెన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (OTPL)ని రూ. 1,264.6 కోట్లకు, ఈవెంట్ టికెటింగ్‌లో రూ. 783.8 కోట్లకు వేస్ట్‌ల్యాండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌ను కొనుగోలు చేసింది.
ఎంటర్‌టైన్‌మెంట్ టికెటింగ్ వ్యాపారంలో ఉన్న దాదాపు 280 మంది ఉద్యోగులు జొమాటోలో భాగం అవుతారు. పేటీఎం ప్రకారం, కంపెనీ 2017లో మొత్తం రూ. 268 కోట్లతో సినిమా టికెటింగ్‌ని ప్రారంభించింది. తర్వాత వ్యాపారాన్ని పెంచడానికి అదనంగా మరిన్ని పెట్టుబడులు కూడా పెట్టింది. ఎంటర్‌టైన్‌మెంట్ టికెటింగ్ వ్యాపారం ఎఫ్‌వై24లో రూ. 297 కోట్ల ఆదాయాన్ని, సర్దుబాటు చేసిన EBITDAలో రూ. 29 కోట్లను కలిగి ఉంది.
ఈ డీల్ ద్వారా వచ్చిన డబ్బులను పేటీఎం తన నగదు ఆదాయం బ్యాలెన్స్ షీట్‌ను మరింత బలోపేతం చేయడానికి, కోర్ చెల్లింపులు, ఆర్థిక సేవల పంపిణీని బలోపేతం చేయడానికి ఉపయోగిస్తుంది. పేటీఎం ప్రస్తుతం ఇండియాలో లావాదేవీలు, ఎంటర్‌టైమెంట్ పరంగా కీలకంగా ఉంది. అలాగే, ఫుడ్ డెలివరీ విభాగంలో జోమాటో సేవలు అందిస్తుంది. మెట్రో పాలిటన్ సిటీల్లోనే కాకుండా చిన్న పట్టణాల్లో సైతం ఈ రెండు సంస్థల వ్యాపారాలు విస్తరించాయి.