29 నెలల కనిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా పదవ నెలలోనూ తగ్గింది.
న్యూఢిల్లీ: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా పదవ నెలలోనూ తగ్గింది. ఈ ఏడాది మార్చిలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 1.34 శాతంగా ఉంది. ఇది 29 నెలల కనిష్టం కావడం గమనార్హం. అంతకుముందు ఫిబ్రవరిలో 3.85 శాతం, జనవరిలో 4.80 శాతంగా నమోదైనట్టు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడించింది. సమీక్షించిన నెలలో టోకు ధరలు తగ్గేందుకు బేసిక్ మెటల్, ఆహార ఉత్పత్తులు, దుస్తులు, ఆహారేతర వస్తువులు, ఖనిజాలు, రబ్బరు, ప్లాస్టిక్ ఉత్పత్తులు, ముడి పెట్రోలియం, సహజ వాయువు ధరలు దిగిరావడం కలిసొచ్చింది.
మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, గతనెలలో ఆహార ద్రవ్యోల్బణం 2.76 శాతం నుంచి 2.32 శాతానికి తగ్గింది. ఇంధన-విద్యుత్ ద్రవ్యోల్బణం 14.82 శాతం నుంచి మార్చిలో 8.96 శాతానికి దిగొచ్చింది. తయారీ ద్రవ్యోల్బణం 0.77 శాతం క్షీణించింది. కాగా, గతవారం విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యం కంటే దిగువన 5.66 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. ఇది 15 నెలల కన్ష్టం. పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) సైతం జనవరిలో 5.2 శాతం నుంచి ఫిబ్రవరిలో 5.6 శాతానికి పెరిగింది.
Also Read..