Meta India:మెటా ఇండియాను వీడిన ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లు!
ప్రముఖ వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. .Latest Telugu News
న్యూఢిల్లీ: ప్రముఖ వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. మాతృసంస్థ మెటా నుంచి ఆయన వైదొలిగినట్టు కంపెనీ తెలిపింది. అభిజిత్ బోస్‌తో పాటు మెటా ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ రాజీవ్ అగర్వాల్ కూడా తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. మెటా ఇండియాకు కీలకమైన ఇద్దరు ఉన్నతోద్యోగులు దూరమవడం చర్చనీయాంశంగా మారింది.
వీరిద్దరూ తమ పదవులకు రాజీనామా చేసేందుకు కంపెనీ కూడా ఆమోదం తెలపడం గమనార్హం. వీరిలో రాజీవ్ అగర్వాల్ వేరే అవకాశాల కోసం తన బాధ్యతలను వదులుకున్నారని, గతేడాది వినియోగదారు-భద్రత, ప్రైవసీ, ఇతర కీలక అంశాల్లో తను కీలక పాత్ర పోషించారని కంపెనీ పార్ట్‌నర్‌షిప్స్ డైరెక్టర్ మనీష్ చోప్రా అన్నారు. అలాగే, వాట్సాప్ ఇండియా హెడ్‌గా అభిజిత్ బోస్ ఎంతో కృషి చేశారని ఆయన పేర్కొన్నారు.
మెటా ఇండియా హెడ్ అజిత్ మోహన్ ప్రముఖ స్నాప్ ఇంక్‌లో చేరేందుకు కంపెనీని విడిచిపెట్టిన కొన్ని రోజుల తర్వాత టాప్ ఎగ్జిక్యూటివ్‌లు వైదొలిగారు. ఇదే సమయంలో మెటా ఇండియా పబ్లిక్ పాలసీకి కొత్త డైరెక్టర్‌గా శివనాథ్ తుక్రాల్‌ను నియమించినట్లు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు.
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ గతవారమే సంస్థలో పని చేస్తున్న వారిలో దాదాపు 13 శాతం అంటే 11 వేల మందికి పైగా ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం తీసుకున్న రోజుల వ్యవధిలో కీలక వ్యక్తులు సంస్థ నుంచి వెళ్లి పోతుండటం గమనార్హం.