రూ. 45,000 కోట్ల నిధులు సేకరించే పనిలో వొడాఫోన్ ఐడియా
నిధులను 4జీ కవరేజ్, 5జీ నెట్‌వర్క్ ప్రారంభం, కార్యకలాపాల సామర్థ్యాన్ని విస్తరించేందుకు పెట్టుబడిగా పెడతామని..
దిశ, బిజినెస్ బ్యూరో: అప్పుల ఊబిలో ఉన్న ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా కష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నిస్తోంది. ఈక్విటీ, ఈక్విటీ-లింక్‌డ్ సాధనాల ద్వారా రూ. 20,000 కోట్ల వరకు నిధులను సమీకరించేందుకు కంపెనీ బోర్డు మంగళవారం ఆమోదం తెలిపింది. ప్రతిపాదించిన నిధుల సమీకరణలో ప్రమోటర్లు కూడా పాల్గొంటారని పేర్కొంది. ఈక్విటీలతో పాటు డెట్ రూపంలో మొత్తంగా వొడాఫోన్ ఐడియా సుమారు రూ. 45,000 కోట్లు సేకరించాలని భావిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఈక్విటీ, డెట్ ద్వారా వచ్చే నిధులను 4జీ కవరేజ్, 5జీ నెట్‌వర్క్ ప్రారంభం, కార్యకలాపాల సామర్థ్యాన్ని విస్తరించేందుకు పెట్టుబడిగా పెడతామని కంపెనీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. తద్వారా కంపెనీ పోటీని మెరుగుపరచుకోవడంతో పాటు వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందిస్తామని పేర్కొంది.
గత కొన్నేళ్ల నుంచి వొడాఫోన్ ఐడియా మనుగడ కోసమే తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రూ. 2.1 లక్షల కోట్ల అప్పులు ఉండటం, భారీగా సబ్‌స్క్రైబర్లను కోల్పోతుండటం వల్ల త్రైమాసిక ఫలితాల్లోనూ నష్టాలను చూస్తోంది. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణ ప్రక్రియ కోసం బ్యాంకర్లు, న్యాయవాదులను నియమించేందుకు కూడా బోర్డు కంపెనీ యాజమాన్యానికి అధికారం ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 2న కంపెనీ తన వాటాదారుల సమావేశం నిర్వహించనుంది. ఈ క్రమంలో వచ్చే త్రైమాసికంలోగా నిధుల సమీకరణను పూర్తి చేయాలని కంపెనీ భావిస్తోంది.