మరో 200 మందిని తొలగించిన Twitter !
గ్లోబల్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో ఉద్యోగుల తొలగింపులు ఇంకా కొనసాగుతున్నాయి.
వాషింగ్టన్: గ్లోబల్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో ఉద్యోగుల తొలగింపులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సంస్థలోని మూడింట రెండు వంతుల ఉద్యోగులను తొలగించిన ట్విట్టర్ ఈసారి 200 మంది లేఆఫ్స్ చేపట్టినట్టు పలు నివేదికలు వెల్లడించాయి. ఈ సంఖ్య మొత్తం ఉద్యోగుల్లో 10 శాతానికి సమానం. ముఖ్యంగా తొలగించబడిన వారిలో మెషిన్ లెర్నింగ్‌పై పనిచేసే ప్రోడక్ట్ మేనేజర్లు, డాటా సైంటిస్టులు, ఇంజనీరింగ్ విభాగాల్లోని వారు ప్రభావితమైనట్టు సమాచారం.
తాజా తొలగింపుల గురించి ట్విట్టర్ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ, సంస్థ కొత్త సబ్‌స్క్రిప్షన్ విధానం ట్విట్టర్ బ్లూ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఉద్యోగి కూడా ఈ జాబితాలో ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. గతేడాది ట్విట్టర్ కొత్త బాస్ ఎలన్ మస్క్ ఏకంగా సంస్థలోని మూడింట రెండు వంతుల ఉద్యోగులను తొలగించిన తర్వాత రానున్న రోజుల్లో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాల తొలగింపు ఉండదని చెప్పారు. కానీ అనూహ్యంగా ఈసారి 200 మందిని తొలగించారు. ప్రస్తుతం సంస్థలో 2,300 మంది ఉద్యోగులు ఉన్నారని ఎలన్ మస్క్ గత నెలలో చెప్పారు.