Union Budget 2024: కేంద్ర బడ్జెట్‌లో భారీ పన్ను ఉపశమనాలు ఉండనున్నాయా?

పన్ను చెల్లింపుదారులను సంతృప్తి పరిచే కీలక నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నారు.

Update: 2024-07-19 16:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: వచ్చే వారంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఎన్డీఏ కూటమికి ఇది మొదటి బడ్జెట్ కానుంది. ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడం, గతంలో కంటే గణనీయంగా సీట్లు తగ్గిన నేపథ్యంలో ఈ బడ్జెట్‌లో గత ప్రకటనలను కొనసాగిస్తూనే, పన్ను చెల్లింపుదారులను సంతృప్తి పరిచే కీలక నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని పన్ను మినహాయింపులు ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వాటిలో కీలకమైన స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచడం, కొత్త ఆదాయ పన్ను విధానంలో ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితి పెంపు, మూలధన లాభాల పన్నును సరళీకరించడం వంటి డిమాండ్లు ఆర్థిక మంత్రికి చేరాయని తెలుస్తోంది. వాటిలో సామాన్యులు ఆశిస్తున్న.. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపు ప్రస్తుతం రూ. 50,000గా దీన్ని రూ. 1,00,000కు పెంచాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. వృత్తిపరమైన పన్ను మినహా ఉద్యోగ సమయంలో అయ్యే ఖర్చులను కవర్ చేయడానికి ఈ మినహాయింపు అందించబడుతుంది. అలాగే, కొత్త ఆదాయపు పన్ను విధానంలో ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు చేయాలి. ఇక, ఈ బడ్జెట్‌లో పన్ను విధానంలో మార్పు ద్వారా మూలధన లాభాల పన్ను విధానాన్ని మరింత సులభతరం చేయాలని నిపుణులు చెబుతున్నారు. దీనికోసం మూలధన ఆస్తులను గరిష్ఠంగా 2-3 విభాగాలుగా వర్గీకరించాలని సూచిస్తున్నారు. 

Tags:    

Similar News