TRAI: ప్రమోషనల్ కాల్స్‌ను తక్షణం నిలిపివేయాలని ట్రాయ్ ఆదేశాలు
ప్రమోషనల్ కాల్స్ విషయంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రాయ్ వెల్లడించింది.
దిశ, బిజినెస్ బ్యూరో: స్పామ్ కాల్స్ విషయంలో టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ నెట్‌వర్క్ కంపెనీలకు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. రిజిస్టర్ చేయని టెలీ మార్కెటింగ్ వారి నుంచి ప్రమోషనల్ కాల్స్ లేదా రికార్డ్ చేసిన, కంప్యూటర్ ఆధారిత వాయిస్ కాల్స్‌ను తక్షణ ఆపాలని స్పష్టం చేసింది. ప్రమోషనల్ కాల్స్ విషయంలో వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రాయ్ వెల్లడించింది. అలాగే, ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రిజిస్టర్ లేని టెలి మార్కెటింగ్ కంపెనీల నుంచి వచ్చే కాల్స్‌పై ఫిర్యాదుల కారణంగా ఆయా టెలి మార్కెటింగ్ కంపెనీల డేటాను సమర్పించాలని టెలికాం కంపెనీలకు తెలిపింది. నిబంధనలను పాటించకుండా ఏ కంపెనీ అయినా ప్రమోషనల్ కాల్స్ చేస్తే రెండేళ్ల పాటు సదరు కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో ఉంచనున్నట్టు స్పష్టం చేసింది. తక్షణం ప్రమోషల్ కాల్స్ నిలిపేయడమే కాకుండా అటువంటి కాల్స్‌పై తీసుకున్న చర్యల గురించి వివరణ ఇవ్వాలి. నెలవారీగా 1, 16వ తేదీల డేటాను ఇవ్వాలని ట్రాయ్ పేర్కొంది.