ఐఫోన్ తయారీ కోసం ప్రయత్నిస్తున్న టాటా గ్రూప్!

దేశీయ అతిపెద్ద సంస్థ టాటా గ్రూప్ స్మార్ట్‌ఫోన్ వ్యాపారంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

Update: 2022-09-09 09:19 GMT

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద సంస్థ టాటా గ్రూప్ స్మార్ట్‌ఫోన్ వ్యాపారంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక రంగాల్లో విస్తరించిన టాటా సంస్థ గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్‌కు చెందిన ఐఫోన్ స్మార్ట్‌ఫోన్‌ల అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. దీనికోసం తైవాన్‌కు చెందిన విస్ట్రన్ కార్పొరేషన్‌తో కలిసి ఎలక్ట్రానిక్స్ తయారీ జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. విస్ట్రన్ కంపెనీకి ఫోన్‌ల ఉత్పత్తితో పాటు అసెంబ్లింగ్, సరఫరా విభాగాల్లో ఉన్న అనుభవం, నైపుణ్యాన్ని వినియోగించడం ద్వారా స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో రాణించాలని టాటా సంస్థ భావిస్తోంది.

చర్చలు విజయవంతంగా పూర్తయితే ఐఫోన్‌లను తయారు చేసే తొలి భారతీయ కంపెనీగా టాటా గ్రూప్ నిలుస్తుంది. ప్రస్తుతం యాపిల్ ఉత్పత్తులను తైవాన్‌కు చెందిన విస్ట్రాన్, ఫాక్స్‌కాన్ టెక్నాలజీ కంపెనీలు చైనాతో పాటు భారత్‌లో నిర్వహిస్తున్నాయి. కరోనా మహమ్మారి పరిస్థితుల తర్వాత చైనాపై ఆధారపడటం తగ్గించాలని చూస్తున్న కంపెనీలతో భాగస్వామ్యం అవ్వాలని టాటా గ్రూప్ చర్చలు జరుపుతోంది. ప్రస్తుతానికి ఇరు సంస్థల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, చర్చలు సానుకూలమైతే విస్ట్రన్ ఇండియాలో టాటా సంస్థ ఈక్విటీలను కొనే అవకాశం ఉంది. లేదా ఇరు కంపెనీలు కలిసి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేస్తాయి. ముఖ్యంగా భారత్‌లో ఐఫోన్ తయారీని ఐదు రెట్లు పెంచాలనే లక్ష్యంతో జాయింట్ వెంచర్ ఏర్పాటు ఉంటుందని సంబంధిత వర్గాలు అభిప్రాయపడ్డాయి. కాగా, ఈ వ్యవహారానికి సంబంధించి టాటా సంస్థంతో పాటు విస్ట్రన్, యాపిల్ కంపెనీలు స్పందించలేదు.

Tags:    

Similar News