బిస్లరీ కొనుగోలు చర్చలను నిలిపేసిన టాటా !
ప్రముఖ ప్యాకేజ్డ్ వాటర్ వ్యాపార సంస్థ బిస్లరీని కొనేందుకు జరుగుతున్న చర్చలను నిలిపేస్తున్నట్టు టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.
ముంబై: ప్రముఖ ప్యాకేజ్డ్ వాటర్ వ్యాపార సంస్థ బిస్లరీని కొనేందుకు జరుగుతున్న చర్చలను నిలిపేస్తున్నట్టు టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. దీనికి సంబంధించి ఎలాంటి ఖచ్చితమైన ఒప్పందం జరగలేదని శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. గతేడాది నవంబర్‌లో కంపెనీ ఛైర్మన్ రమేశ్ చౌహాన్ కొనుగోలుదారుల కోసం చూస్తున్నామని, టాటా కన్స్యూమర్‌తో పాటు మరికొన్ని కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.
మెజారిటీ వాటాను రూ. 6-7 వేల కోట్లకు విక్రయించనున్నట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. నెలల వ్యవధిలో ఇరు కంపెనీల మధ్య ఒప్పందం జరుగుతుందని అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, తాజాగా టాటా సంస్థ బిస్లరీ కొనుగోలు చర్చలు నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. కొనుగోలు విషయంలో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని స్పష్టం చేసింది.
కాగా, బిస్లరీ సంస్థ 1965లో ముంబైలో ఏర్పాటైంది. మొదటగా దీన్ని ఇటాలియన్ సంస్థ స్థాపినగా, ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకు రమేశ్ చౌహాన్ రూ. 4 లక్షలకు దక్కించుకున్నారు. ప్రస్తుతం బిస్లరీ బ్రాండ్‌కు దేశీయ, అంతర్జాతీయంగా 122 ఆపరేషనల్ ప్లాంట్లు, 4,500 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. కంపెనీ రూ. 200 కంటే ఎక్కువ ఆదాయాన్ని కలిగి ఉంది.