'విండ్ మ్యాన్ ఆఫ్ ఇండియా' తులసి తాంతి ఇకలేరు!

భారత పునరుత్పాదక రంగానికి మార్గదర్శిగా పేరుగాంచిన ప్రముఖ విండ్ ఎనర్జీ సంస్థ సుజ్లాన్ ఎనర్జీ వ్యవస్థాపకుడు తులసీ తాంతి కన్ను మూసినట్టు కంపెనీ ఆదివారం ప్రకటనలో వెల్లడించింది.

Update: 2022-10-02 10:25 GMT

ముంబై: భారత పునరుత్పాదక రంగానికి మార్గదర్శిగా పేరుగాంచిన ప్రముఖ విండ్ ఎనర్జీ సంస్థ సుజ్లాన్ ఎనర్జీ వ్యవస్థాపకుడు తులసీ తాంతి కన్ను మూసినట్టు కంపెనీ ఆదివారం ప్రకటనలో వెల్లడించింది. ఆయన వయసు 64 సంవత్సరాలు. 1995లో సుజ్లాన్ ఎనర్జీని స్థాపించడం ద్వారా విద్యుదుత్పత్తి రంగంలో అవకాశాలను సృష్టించి 'విండ్ మ్యాన్ ఆఫ్ ఇండియా' గా ప్రసిద్ధి చెందిన తులసీ తాంతి, గుండెపోటుతో శనివారం కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజ్‌కోట్‌కు చెందిన తులసి తాంతి తన వ్యాపారాలను అహ్మదాబాద్‌లో ప్రారంభించిన అనంతరం పూణెలో స్థిరపడ్డారు.

దేశీయ విండ్ ఎనర్జీ రంగంలో రాణించేందుకు సుజ్లాన్ ఎనర్జీని స్థాపించడమే కాకుండా చాలా తక్కువ సమయంలోనే భారత అతిపెద్ద విండ్ ఎనర్జీ కంపెనీగా సుజ్లాన్‌ను నిలిపారు. ప్రస్తుతం కంపెనీ 19.4 గిగావాట్ల విండ్ ఎనర్జీ సామర్థ్యాన్ని కలిగి ఉండగా, దేశంలో 33 శాతం మార్కెట్ వాటాతో పాటు 17 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. 1958లో జన్మించిన తులసి తాంతి, గుజరాత్ యూనివర్శిటీ నుంచి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేశారు. ఈ రంగంలో విప్లవాన్ని సృష్టించిన కారణంగా ఆయనకు హీరో ఆఫ్ ది ఎన్విరాన్‌మెంట్, ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ వంటి అవార్డులు దక్కాయి.

విండ్ ఎనర్జీ రంగంలోకి రాకముందు టెక్స్‌టైల్ వ్యాపారంలో ఉన్నఆయన 1995లో సుజ్లాన్ ఎనర్జీని స్థాపించి పునరుత్పాదక రంగంలోకి అడుగుపెట్టారు. 2001లో తన టెక్స్‌టైల్ వ్యాపారాన్ని మూసేశారు. ప్రస్తుతానికి సుజ్లాన్ ఎనర్జీ మార్కెట్ విలువ రూ. 8,536 కోట్లుగా ఉంది. పునరుత్పాదక రంగంలో ఎన్నో సేవలందించడంతో పాటు దేశ ఆర్థిక ప్రగతికి కృష్టి చేసిన తులసి తాంతి మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖలు సంతాపం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News