వరుస తొమ్మిది సెషన్‌ల లాభాలకు బ్రేక్!
దేశీయ ఈక్విటీ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్ పడింది. సోమవారం ఉదయం నుంచే నష్టాల్లో మొదలైన సూచీలు చివరి వరకు అదే ధోరణిలో కదలాడాయి.
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్ పడింది. సోమవారం ఉదయం నుంచే నష్టాల్లో మొదలైన సూచీలు చివరి వరకు అదే ధోరణిలో కదలాడాయి. దాంతో వరుస తొమ్మిది సెషన్ల లాభాల తర్వాత నష్టాలు నమోదయ్యాయి. ప్రధానంగా టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలు త్రైమాసిక ఫలితాల్లో నిరాశపరచడంతో ఐటీ షేర్లలో అమ్మకాలు పోటు మార్కెట్లకు ప్రతికూలంగా మారింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇన్ఫోసిస్ అత్యధికంగా 9 శాతానికి పైగా పతనమైంది. ఐటీ రంగం ఆదాయాల వెల్లడి బలహీనంగా ప్రారంభం కావడం మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో గరిష్ఠాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో నష్టాలు పెరిగాయి.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 520.25 పాయింట్లు పతనమై 59,910 వద్ద, నిఫ్టీ 121.15 పాయింట్లు కుదేలై 17,706 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ రంగం అత్యధికంగా 4.71 శాతం బలహీనపడగా, ఫార్మా, హెల్త్‌కేర్ నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్, ఎస్‌బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, అల్ట్రా సిమెంట్, ఐటీసీ, ఏషియన్ పెయింట్ కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి.
ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, ఎన్‌టీపీసీ, ఎల్అండ్‌టీ, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82 వద్ద ఉంది.
Also Read..