స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న నష్టాలు!
దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. గత నాలుగు సెషన్ల నుంచి బలహీనంగా కొనసాగుతున్న సూచీలు గురువారం ట్రేడింగ్‌లోనూ అదే ధోరణిని కొనసాగించాయి.
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. గత నాలుగు సెషన్ల నుంచి బలహీనంగా కొనసాగుతున్న సూచీలు గురువారం ట్రేడింగ్‌లోనూ అదే ధోరణిని కొనసాగించాయి. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన తర్వాత క్రమంగా నష్టాల్లో జారాయి. మిడ్-సెషన్ సమయంలో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయంగా ఫిబ్రవరి నెలకు సంబంధించి డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు రోజు కావడంతో అమ్మకాలు పెరిగాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశాలున్నాయనే అంచనాల మధ్య మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది.
అనంతరం కొనసాగిన ఒడిదుడుకుల మధ్య చివరి గంటలో అమ్మకాలు పెరగడంతో నష్టాలు పెరిగాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 139.18 పాయింట్లు పతనమై 59,605 వద్ద, నిఫ్టీ 43.05 పాయింట్లు నష్టపోయి 17,511 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, మెటల్ రంగాలు పర్వాలేదనిపించగా, మీడియా, రియల్టీ 1 శాతానికి పైగా బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, టాటా మోటార్స్, ఎస్‌బీఐ, టాటా స్టీల్, సన్‌ఫార్మా కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ఏషియన్ పెయింట్, ఎల్అండ్‌టీ, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, టైటాన్, బజాజ్ ఫిన్‌సర్వ్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.72 వద్ద ఉంది.