తొమ్మిదేళ్ల కనిష్టానికి స్టార్టప్‌ల నిధుల సేకరణ!

దేశీయ స్టార్టప్ కంపెనీలు నిధులు సేకరించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి

Update: 2023-05-10 15:12 GMT

న్యూఢిల్లీ: దేశీయ స్టార్టప్ కంపెనీలు నిధులు సేకరించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. నిధుల సమీకరణతో పాటు ఒప్పందాల సంఖ్యా పరంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో స్టార్టప్ కంపెనీల నిధుల సేకరణ తొమ్మిదేళ్ల కనిష్ఠానికి చేరుకుంది. భారత స్టార్టప్‌లలో గత నెల ఏంజెల్ ఇన్వెస్ట్‌మెంట్, వెంచర్ కేపిటల్ ఫండింగ్ 58 ఒప్పందాలు చేసుకోగా, సుమారు రూ. 3,120 కోట్ల నిధులను పెట్టుబడిగా పెట్టాయి.

ప్రముఖ పరిశోధనా సంస్థ వీసీ సర్కిల్ ప్రకారం, తొమ్మిదేళ్లలోనే ఎన్నడూ లేనంత తక్కువ నిధులను స్టార్టప్ కంపెనీలు రాబట్టాయి. గతేడాది ఏప్రిల్‌లో భారత స్టార్టప్‌లు 146 ఒప్పందాల ద్వారా సుమారు రూ. 28 వేల కోట్ల విలువైన నిధులను సమీకరించాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు గత ఏడాది వచ్చిన దాంట్లో వచ్చిన మొత్తానికి దగ్గరగా కూడా లేకపోవడం గమనార్హం. ఈ ఏడాది మార్చిలో స్టార్టప్‌లకు మెరుగైన నిధులు వచ్చాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు చుట్టుముట్టడం, స్టాక్ మార్కెట్లలో అస్థిరత, కీలక వడ్డీ రేట్లు పెరగడం వంటి అంశాల కారణంగా పెట్టుబడిదారులు స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేసేందుకు వెనుకాడారు. దానివల్లే స్టార్టప్‌లు విపరీతమైన నగదు కొరత సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయని వీసీ సర్కిల్ పేర్కొంది.

Tags:    

Similar News