అమెజాన్ ప్రైమ్‌లో రూ.399కే సోనీ ఓటీటీ సర్వీసెస్
ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉన్న యూజర్లు యాడ్-ఆన్ సబ్స్క్రిప్షన్ ద్వారా ఏడాదికి రూ. 399 చెల్లించి యాక్సెస్ పొందవచ్చు.
దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల జీతో విలీనం వ్యవహారం నుంచి బయటకు వచ్చిన సోనీ పిక్చర్స్ తాజాగా అమెజాన్ ప్రైమ్‌తో కీలక ఒప్పందం చేసుకుంది. సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్కు చెందిన సోనీ పిక్చర్స్ టెలివిజన్ తన ఓటీటీ సేవలను అందించేందుకు ప్రైమ్‌తో ఒప్పందంపై సంతకం చేసింది. ఈ భాగస్వామ్యంతో ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉన్న యూజర్లు యాడ్-ఆన్ సబ్స్క్రిప్షన్ ద్వారా ఏడాదికి రూ. 399 చెల్లించి సోనీ పిక్చర్స్-స్ట్రీమ్ యాక్సెస్ పొందవచ్చు. ప్రత్యేకంగా భారతీయ ప్రేక్షకుల కోసం సోనీ పిక్చర్స్‌కు చెందిన భిన్నమైన కంటెంట్‌ను ఆస్వాదించవచ్చని, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన బ్లాక్‌బస్టర్ సినిమాలు, టీవీ షోలను వీక్షించవచ్చని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా ఎక్కువ ఆదరణ కలిగిన చార్లీస్ ఏంజెల్స్, మెన్ ఇన్ బ్లాక్, ఘోస్ట్ బస్టర్స్ వంటి సినిమాలు, ఇంకా టీవీ షోలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. వివిధ రకాల కంటెంట్‌ను తమ వీక్షకులకు అందించేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటామని ఇండియా ప్రైమ్ వీడియో ఛానెల్స్ హెడ్ వివేక్ శ్రీవాస్తవ అన్నారు. సోనీ పిక్చర్స్ వద్ద ఉన్న లైబ్రీతో ప్రైమ్ మెంబర్లు వారికి నచ్చిన సినిమాలు, సిరీస్‌లను వీక్షించవచ్చని ఆయన పేర్కొన్నారు. సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ప్రస్తుతం సోనీలివ్, క్రంచిరో ఇండియా వంటి ఓటీటీలను నిర్వహిస్తోంది. సోనీలివ్ అనేది సోనీ గ్రూపునకు చెందిన ఇండియా మీడియా యూనిట్. క్రంచిరోల్ అనేది క్రంచైరోల్ ఇండియా ఆధ్వర్యంలో స్ట్రీమ్ అవుతున్న యానిమేషన్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్.