వరుసగా రెండో రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు!

Update: 2022-02-09 11:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను దక్కించుకున్నాయి. మంగళవారం నాటి ఉత్సాహంతో మొదలైన సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలకు తోడు ఆసియా మార్కెట్ల మద్దతుతో మెరుగైన లాభాలను సాధించాయి. దేశీయంగా కూడా కొవిడ్ మహమ్మారి పరిస్థితులు మెరుగుపడటం వల్ల పలు రాష్ట్రాల్లో ఆంక్షలను తొలగించడం వంటి పరిణామాలతో పాటు ఆటో, బ్యాంకింగ్ రంగాల షేర్లు రాణించడంతో స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. అలాగే, గురువారం జరగబోయే ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ) సమావేశం, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలకు సంబంధించి మదుపర్లు ఆసక్తిగా ఉన్నారు. బుధవారం ఉదయం నుంచే లాభాల్లో ర్యాలీ చేసిన స్టాక్ మార్కెట్లు మిడ్-సెషన్ సమయంలో కొంత ఊగిసలాట ధోరణిలో కదలాడినప్పటికీ చివరికి ఫైనాన్స్, ఐటీ రంగాల నుంచి కూడా మద్దతు లభించడంతో అధిక లాభాల్లో ట్రేడయ్యాయి.

దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 657.39 పాయింట్లు ఎగసి 58,465 వద్ద, నిఫ్టీ 197.05 పాయింట్లు పెరిగి 17,463 వద్ద ముగిశాయి. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్ మాత్రమే నీరసించగా, ఆటో, మీడియా, మెటల్, ప్రైవేట్ బ్యాంక్ రంగాలు 1-2 శాతం మధ్య పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో సన్‌ఫార్మా, ఐటీసీ, పవర్‌గ్రిడ్ షేర్లు మాత్రమే నష్టాలను ఎదుర్కొన్నాయి. మిగిలిన అన్ని కంపెనీల స్టాక్స్ రాణించాయి. ముఖ్యంగా మారుతీ సుజుకి, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, టైటాన్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా షేర్లు అధికంగా 1.50-4.1 శాతం లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 74.76 వద్ద ఉంది. బుధవారం ట్రేడింగ్‌లో ఈ వారం లిస్టింగ్‌కి వచ్చిన అదానీ విల్మర్ కంపెనీ షేర్ ధర ఏకంగా 20 శాతం ర్యాలీ చేయడం విశేషం. 

Tags:    

Similar News