సరికొత్త గరిష్టాలను తాకిన నిఫ్టీ
కీలక రంగాల్లో కొనుగోళ్లతో మార్కెట్లు వరుసగా ఐదవ రోజు పుంజుకున్నాయి.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతూనే ఉంది. గతవారం వరుస సెషన్లతో ర్యాలీ చేసిన సూచీలు సోమవారం సైతం దాన్ని కొనసాగించాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లతో పాటు ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా కీలక రంగాల్లో కొనుగోళ్లతో మార్కెట్లు వరుసగా ఐదవ రోజు పుంజుకున్నాయి. నిఫ్టీ బెంచ్‌మార్క్ సరికొత్త రికార్డు స్థాయిలను తాకింది. సోమవారం ట్రేడింగ్‌లో ఉదయం నుంచే లాభాలతో మొదలైన సూచీలు రోజంతా అదే ధోరణిలో కదలాడాయి. ఆఖరు గంటలో కొంత నెమ్మదించినప్పటికీ ఫైనా, ఆటో, ఎనర్జీ రంగాల్లో మదుపర్ల కొనుగోళ్లు మద్దతిచ్చాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 281.52 పాయింట్లు ఎగసి 72,708 వద్ద, నిఫ్టీ 81.55 పాయింట్ల లాభంతో 22,122 వద్ద ముగిశాయి. నిఫ్టీలో కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, హెల్త్‌కేర్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, సన్‌ఫార్మా, మారుతీ సుజుకి, ఐటీసీ, నెస్లె ఇండియా, టైటాన్ కంపెనీల షేర్లు అధిక లాభాలను సాధించాయి. ఎల్అండ్‌టీ, విప్రో, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్, టాటా మోటార్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.02 వద్ద ఉంది.