వారాంతం లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గడిచిన ఐదు సెషన్లలో వరుసగా అధిక నష్టాలను ఎదుర్కొన్న సూచీలు శుక్రవారం స్వల్ప లాభాలతో ఈ వారాన్ని ముగించాయి.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఎట్టకేలకు నష్టాల నుంచి బయటపడ్డాయి. గడిచిన ఐదు సెషన్లలో వరుసగా అధిక నష్టాలను ఎదుర్కొన్న సూచీలు శుక్రవారం స్వల్ప లాభాలతో ఈ వారాన్ని ముగించాయి. ప్రధానంగా దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగియడం, ఫలితాలకు ముందు మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో స్టాక్ మార్కెట్లలో నష్టాలు కొనసాగాయి. వారాంతం రోజున దేశ జీడీపీ గణాంకాలకు ముందు ఇన్వెస్టర్లు సానుకూలంగా స్పందించడం, కీలక ఫైనాన్స్, మెటల్ రంగాల్లో కొనుగోళ్లు లాభాలకు కారణమయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 75.71 పాయింట్లు లాభపడి 73,961 వద్ద, నిఫ్టీ 42.05 పాయింట్ల లాభంతో 22,530 వద్ద ముగిశాయి. నిఫ్టీలో రియల్టీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, ఫైనాన్స్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్అండ్‌టీ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. నెస్లె ఇండియా, టీసీఎస్, మారుతీ సుజుకి, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హిందూస్తాన్ యూనిలీవర్, టైటాన్, యాక్సిస్ బ్యాంక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.36 వద్ద ఉంది.