Stock Market: భారీ నష్టాల నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి లభించిన సానుకూల సంకేతాలకు తోడు కనిష్టాల వద్ద కొనుగోళ్లతో లాభాలను సాధించాయి.

Update: 2025-01-07 12:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఈక్విటీ మార్కెట్లు ఈ ఏడాది భారీ నష్టాలను చూసిన ఒకరోజు తర్వాత కోలుకున్నాయి. అంతకుముందు సెషన్‌లో చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ భయాల కారణంగా మార్కెట్లలో అమ్మకాలు ఒత్తిడి కనిపించింది. మంగళవారం ట్రేడింగ్‌లో సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి లభించిన సానుకూల సంకేతాలకు తోడు కనిష్టాల వద్ద కొనుగోళ్లతో లాభాలను సాధించాయి. ప్రధానంగా కొత్త వైరస్ విషయంలో ఆందోళన అక్కరలేదనే వార్తలతో మార్కెట్లు పుంజుకున్నాయి. ఇదే సమయంలో వృద్ధికి సంబంధించి ఆర్‌బీఐ కొంత సానుకూలంగా ఉండటంతో మదుపర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 234.12 పాయింట్లు లాభపడి 78,199 వద్ద, నిఫ్టీ 91.85 పాయింట్లు పెరిగి 23,707 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ రంగం మినహా అన్ని రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా మోటార్స్, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లె ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, ఏషియన్ పెయింట్ షేర్లు అధిక లాభాలను చూశాయి. జొమాటో, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, కోటక్ బ్యాంక్, ఐటీసీ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 85.73 వద్ద ఉంది.  

Tags:    

Similar News