Ola Electric: నిబంధనల ఉల్లంఘనపై ఓలా ఎలక్ట్రిక్‌కు సెబీ వార్నింగ్

సాధారణంగా కంపెనీకి సంబంధించిన ఎలాంటి ప్రణాళికలనైనా మొదట స్టాక్ ఎక్స్ఛేంజీలకు చెప్పాల్సి ఉంటుంది.

Update: 2025-01-08 15:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న ప్రముఖ ఈవీ టూవీలర్ల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్‌కు మరో కొత్త సవాలు ఎదురైంది. నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గట్టి వార్నింగ్ లేఖ జారీ చేసింది. స్టాక్ ఎక్స్ఛేంజీలలో పెట్టుబడిదారులకు అధికారికంగా చెప్పడానికి చాలా ముందుగానే, కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ భవీష్ అగర్వాల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో విస్తరణ గురించి ప్రకటన చేశారని సెబీ పేర్కొంది. గత నెల ప్రారంభంలో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు రిటైల్ స్టోర్ల సంఖ్యను 4000కు పెంచనున్నట్టు భవీష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. సాధారణంగా కంపెనీకి సంబంధించిన ఎలాంటి ప్రణాళికలనైనా మొదట స్టాక్ ఎక్స్ఛేంజీలకు చెప్పాల్సి ఉంటుంది. అయితే, భవీష్ అగర్వాల్ రిటైల్ స్టోర్ల సామర్థ్య పెంపు విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీని తర్వాత స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించారు. ఈ ధోరణి నియంత్రణ నియమాలను ఉల్లంఘించడమేనని, స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీల అన్ని కార్యక్రమాలు, సమాచారం బహిరనంగా చెప్పడానికి ముందు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేయాలని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రవర్తన పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించింది. సెబీ లేఖ కారణంగా బుధవారం ఓలా కంపెనీ షేర్లు సుమారు 4 శాతం మేర పతనమయ్యాయి. అయితే, దీనిపై స్పందించిన ఓలా సెబీ లేఖ కారణంగా ఆర్థిక పరమైన సమస్యలు ఉండవని ప్రకటించింది. దీంతో షేర్లు కోలుకుని స్వల్ప లాభంతో రూ. 79.5 వద్ద ముగిశాయి. 

Tags:    

Similar News