Stock Markets: ఫెడ్ ప్రభావం.. కొత్త రికార్డు గరిష్ఠాలకు స్టాక్ మార్కెట్లు

ప్రధానంగా బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్ల ఉత్సాహం కనిపించింది.

Update: 2024-09-19 13:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో వరుస రికార్డుల ర్యాలీ కొనసాగుతోంది. కీలకమైన అమెరికా ఫెడ్ నాలుగు సంవత్సరాల తర్వాత వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లకు తగ్గించడంతో మన మార్కెట్లు రికార్డు గరిష్ఠాలకు చేరుకున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్ల ఉత్సాహం కనిపించింది. అయితే, గ్లోబల్ మార్కెట్లలో రేట్ల తగ్గింపు మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో లాభాల స్వీకరణకు దారితీసినప్పటికీ దేశీయ హెవీవెయిట్ రంగాలైన బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ వంటి రంగాల షేర్లలో విదేశీ ఇన్‌ఫ్లోలు, ఆర్‌బీఐ సైతం అక్టోబరులో వడ్డీ రేట్లలో మార్పు చేయవచ్చనే సంకేతాలతో రికార్డు ట్రేడింగ్ జరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గురువారం ఉదయం ఫెడ్ ప్రభావంతో సెన్సెక్స్ 83,773 వద్ద ఆల్‌టైమ్ హై స్థాయిని తాకింది. ఆ తర్వాత నిఫ్టీలో కీలక స్థాయిల వద్ద అమ్మకాల ఒత్తిడి వల్ల లాభాలను తగ్గాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 236.57 పాయింట్లు పుంజుకుని 83,184 వద్ద, నిఫ్టీ 38.25 పాయింట్లు లాభపడి 25,415 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, మెటల్ రంగాలు బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎన్‌టీపీసీ, కోటక్ బ్యాంక్, టైటాన్, నెస్లె ఇండియా, హిందూస్తాన్ యూనిలీవర్, మారుతీ సుజుకి షేర్లు లాభాలను సాధించాయి. అదానీ పోర్ట్స్, ఎల్అండ్‌టీ, టీసీఎస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.67 వద్ద ఉంది. 

Tags:    

Similar News