Stock Market: వారాంతం భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ప్రధానంగా ఐటీ రంగం షేర్లలో కొనుగోళ్లు అధిక లాభాలకు కారణమయ్యాయి.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస నష్టాల తర్వాత కోలుకున్నాయి. కేంద్ర బడ్జెట్ ఇచ్చిన ప్రభావంతో ఐదు రోజుల పాటు పతనమైన సూచీలు వారాంతం భారీ లాభాలతో పుంజుకున్నాయి. ప్రధానంగా ఐటీ రంగం షేర్లలో కొనుగోళ్లు అధిక లాభాలకు కారణమయ్యాయి. అమెరికా రెండో త్రైమాసికానికి సంబంధించి ఊహించిన దానికంటే మెరుగైన గణాంకాలు నమోదవడంతో ఐటీ షేర్లలో మదుపర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లను జరిపారు. దీనికితోడు రిలయన్స్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‌టెల్ లాంటి బ్లూచిప్ స్టాక్స్‌లో ర్యాలీ కారణంగా సెన్సెక్స్ ఇండెక్స్ 1200 పాయింట్లకు పైగా పెరిగింది. వీటికి తోడు వరుస నష్టాల తర్వాత కనిష్టాల వద్ద ఇన్వెస్టర్లు షేర్లు కొనేందుకు మొగ్గు చూపడం కూడా కలిసొచ్చింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,292.92 పాయింట్లు లాభపడి 81,332 వద్ద, నిఫ్టీ 428.75 పాయింట్ల లాభంతో 24,834 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, ఫార్మా, ఐటీ, బ్యాంకింగ్ సహా అన్ని రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో నెస్లె ఇండియా షేర్ మాత్రమే నష్టపోయింది. భారతీ ఎయిర్‌టెల్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా సహా అన్ని షేర్లు అధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.73 వద్ద ఉంది. మార్కెట్లలో భారీ లాభాల కారణంగా మదుపర్లు శుక్రవారం దాదాపు రూ. 7 లక్షల కోట్లు లాభపడ్డారు. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 452.93 లక్షల కోట్లకు చేరుకుంది.