Stock Market: వారాంతం స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు

వారాంతం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి.

Update: 2024-08-23 11:07 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: వారాంతం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పావెల్ నుంచి వడ్డీ రేట్ల తగ్గింపు ప్రకటన రానున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉన్నారు. దీంతో శుక్రవారం కొనుగోళ్లకు అంతగా ఆసక్తి చూపించలేదు. అలాగే, ఐటీ షేర్లలో కూడా ఎక్కువ అమ్మకాలు జరిగాయి. ఆటోమొబైల్‌ మినహా దాదాపు అన్నిరంగాల షేర్లలో ఇదే ధోరణి కనిపించింది. దీంతో సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఉదయం 81,165 పాయింట్లతో ప్రారంభంలోనే సెన్సెక్స్ ఆద్యంతం ఒడిదుడుకులను ఎదుర్కొంది. నిఫ్టీ సైతం ఇదే బాటలో పయనించింది.

మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 33.02 పాయింట్ల లాభంతో 81,086.21 వద్ద, నిఫ్టీ 11.65 పాయింట్ల లాభంతో 24,823.15 వద్ద ఉన్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో టాటా మోటార్స్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభాలను సాధించగా, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్‌టెక్, ఏషియన్ పెయింట్స్, టైటాన్ షేర్లు నష్టపోయాయి. ఆటోరంగ ఇండెక్స్ 1 శాతం పెరగ్గా, మెటల్, రియల్టీ, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, ఐటీ 0.5-2.5 శాతం చొప్పున క్షీణించాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 4 పైసలు పెరిగి 83.89 వద్ద ముగిసింది.

Tags:    

Similar News