వారంతం ఎట్టకేలకు భారీ లాభాల్లోకి మారిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి

Update: 2023-02-03 12:23 GMT

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. గత కొద్ది రోజులుగా అదానీ గ్రూప్‌పై వస్తున్న ఆరోపణల ప్రభావం శుక్రవారం మార్కెట్లో అంతగా కనిపించలేదు. ఉదయం ప్రారంభం నుంచే ఉత్సాహంగా మొదలైన సూచీలు మధ్యాహ్నం తర్వాత మరింత జోరందుకున్నాయి. ఉదయం సెన్సెక్స్ 60,350.01 వద్ద లాభాలతో ప్రారంభమై చివరి వరకు అదే ధోరణిని కొనసాగించాయి. ముఖ్యంగా అదానీ స్టాక్స్ గురించి కొన్ని సానుకూల సంకేతాలు రావడంతో దేశీయంగా కొనుగోళ్లు పెరిగాయి. ఫలితంగా అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి.

దీంతో మర్కెట్లు ముగిసే నాటికి సెన్సెక్స్ 909.64 పాయింట్లు(1.52 శాతం) పెరిగి 60,841.88 వద్ద, నిఫ్టీ 243.65 పాయింట్ల(1.38 శాతం) లాభంతో 17,854.05 వద్ద ముగిశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, మెటల్, మీడియా, ఫార్మా, ఎనర్జీ రంగాలు లాభాలను సాధించాయి. కొద్ది రోజులుగా భారీగా పడిపోతున్న అదానీ గ్రూప్ స్టాక్స్‌లలో శుక్రవారం నాటి పరిణామాల్లో కొన్ని షేర్లు కోలుకున్నాయి.

నిఫ్టీలో అదానీ పోర్ట్స్‌ షేరు ధర భారీగా పెరిగింది. తరువాత టైటాన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఎంఅండ్‌ఎం, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభపడగా, దివీస్‌ ల్యాబ్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, బీపీసీఎల్‌, టాటా కన్జ్యూమర్‌, హిందాల్కో, విప్రో, టెక్ మహీంద్రా కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి. శుక్రవారం మార్కెట్ ముగిసేనాటికి డాలర్‌తో రూపాయి మారకం విలువ 81.82 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి : వరుసగా రెండోరోజు మిశ్రమంగా మార్కెట్ల ర్యాలీ!

Tags:    

Similar News