PNB: రెండు కొత్త ఎఫ్‌డీలను తీసుకొచ్చిన పంజాబ్ నేషనల్ బ్యాంక్
303, 506 రోజుల కాలవ్యవధులపై అధిక వడ్డీ ఆఫర్
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల(ఎఫ్‌డీ)కు సంబంధించి కొత్తగా రెండు ప్రత్యేక డిపాజిట్ కాలవ్యవధులను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ. 3 కోట్ల కంటే తక్కువ మొత్తం ఎఫ్‌డీలలో 303 రోజుల కాలవ్యవధిని తీసుకురాగా, ఈ ఎఫ్‌డీలో మదుపు చేసిన వారికి 7 శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే, 506 రోజుల కాలవ్యవధితో మరో కొత్త ఎఫ్‌డీని పరిచయం చేయగా, దీనిపై 6.7 శాతం వడ్డీని బ్యాంకు హామీ ఇచ్చింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ రెండు ఎఫ్‌డీలు 2025, జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చాయని పజాబ్ నేషనల్ బ్యాంక్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక, మిగిలిన కాలవ్యవధులకు సంబంధించి 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలవ్యవధులపై 3.50 శాతం నుంచి 7.25 శాతం మధ్య వడ్డీని అందిస్తోంది. వీటిలో అత్యధికంగా 400 రోజుల కాలవ్యవధి కలిగిన ఎఫ్‌డీపై గరిష్ఠంగా 7.25 శాతం వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్‌లకు సాధారణ ఖాతాదారుల కంటే 0.5 శాతం వరకు అధిక వడ్డీ రాబడిని బ్యాంకు అందిస్తుంది. 7 రోజుల నుంచి 10 ళ్ల మధ్య ఎఫ్‌డీలపై 4 శాతం నుంచి 7.75 శాతం మధ్య వడ్డీని ఆఫర్ చేస్తోంది. కొత్త ఎఫ్‌డీలపై కూడా బ్యాంక్ సీనియర్ సిటిజన్‌లకు 0.5 శాతం అధిక వడ్డీని ఇస్తుంది.