Stock Market: వారాంతం భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మద్దతు లేకపోవడం, లాభాల స్వీకరణ కారణంగా సెన్సెక్స్, నిఫ్టీలో భారీగా కుదేలయ్యాయి
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్ల వరుస రికార్డు లాభాలకు బ్రేక్ పడింది. అంతకుముందు సెషన్‌లో కొత్త గరిష్టాలను తాకిన సూచీలు శుక్రవారం డీలా పడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మద్దతు లేకపోవడం, కీలక స్థాయిల వద్ద లాభాల స్వీకరణ కారణంగా సెన్సెక్స్, నిఫ్టీలో భారీగా కుదేలయ్యాయి. అమెరికా ఫ్యాక్టరీ డేటా మదుపర్ల సెంటిమెంట్‌ను బలహీనపరచగా, ఆ ప్రభావం వల్ల ఆసియా మార్కెట్లు కూడా నీరసించాయి. దీనికితోడు ఇజ్రాయెల్-హమాస్ ఉద్రిక్త పరిస్థితులు, గరిష్ఠాల వద్ద అమ్మకాల ఒత్తిడితో స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు ఎదురయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 885.60 పాయింట్లు నష్టపోయి 80,981 వద్ద, నిఫ్టీ 293.20 పాయింట్ల నష్టంతో 24,717 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, ఐటీ, బ్యాంకింగ్ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సన్‌ఫార్మా, కోటక్ బ్యాంక్, నెస్లె ఇండియా షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. మారుతీ సుజుకి, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఎల్అండ్‌టీ, ఎంఅండ్ఎం స్టాక్స్ అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.75 వద్ద ఉంది. వారాంతం భారీ నష్టాల కారణంగా ఇన్వెస్టర్లు ఒక్కరోజే రూ. 5 లక్షల కోట్లకు పైగా నష్టపోయాయి. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 457 లక్షల కోట్లకు తగ్గింది.