Stock Market: వారాంతం కొత్త గరిష్ఠాలను తాకిన సూచీలు
కీలక ఇన్ఫోసిస్, ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లలో కొనుగోళ్ల ఉత్సాహం కనిపించింది.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండోరోజు కొత్త రికార్డు స్థాయిలలో నమోదయ్యాయి. అంతకుముందు సెషన్‌లో దేశీయ బ్లూచిప్ స్టాక్స్ ర్యాలీ మద్దతివ్వగా, శుక్రవారం సైతం అంతర్జాతీయ మార్కెట్లతో పాటు కీలక ఇన్ఫోసిస్, ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లలో కొనుగోళ్ల ఉత్సాహం కనిపించింది. ప్రధానంగా గ్లోబల్ మార్కెట్లలో ర్యాలీ ప్రభావంతో దేశీయంగా సెన్సెక్స్ 82,637 పాయింట్లకు, నిఫ్టీ 25,268తో ఆల్‌టైమ్ హై స్థాయిలను తాకాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 231.16 పాయింట్లు లాభపడి 82,365 వద్ద, నిఫ్టీ 83.95 పాయింట్లు పెరిగి 25,265 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఫార్మా, రియల్టీ, ఆటో, ఐటీ, మెటల్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, భారతీ ఎయిర్‌టెల్, పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా షేర్లు లాభాలను సాధించాయి. టాటా మోటార్స్, రిలయన్స్, టెక్ మహీంద్రా, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతీ సుజుకి స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.85 వద్ద ఉంది.