మొబైల్ బ్యాంకింగ్ ఎస్ఎంఎస్ ఛార్జీలు మాఫీ చేసిన SBI!
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు ఊరట కల్పించే వార్తనందించింది.
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు ఊరట కల్పించే వార్తనందించింది. మొబైల్ నుంచి చేసే నగదు లావాదేవీలపై విధించే ఎస్ఎంఎస్ ఛార్జీలను మాఫీ చేస్తున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నిర్ణయంతో ఎస్‌బీఐ వినియోగదారులు మొబైల్ బ్యాంకింగ్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ సదుపాయాన్ని ఉచితంగా ఉపయోగించవచ్చు. సాధారణ వినియోగదారులకు కూడా మొబైల్ బ్యాంకింగ్ సేవలను చేరువ చేసేందుకు, మొబైల్ బ్యాంకింగ్‌ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు బ్యాంకు తెలిపింది.
ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా యూఈస్ఎస్‌డీ సేవలను ఎస్‌బీఐ ఖాతాదారులు వినియోగించుకోవచ్చు. యూఎస్ఎస్‌డీ అంటే అన్-స్ట్రక్చర్‌డ్ సంప్లిమెంటరీ సర్వీస్ డేటా. మొబైల్ ద్వారా నగదును బదిలీ చేసేందుకు, బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ చూసుకోవడం, బ్యాంకు స్టేట్‌మెంట్ సహా ఇతర సేవలను దీని ద్వారానే తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ సేవలను వినియోగదారులు మొబైల్ నుంచి పొందవచ్చు. స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం లేకుండా కూడా బ్యాంకు నిర్దేశించిన *99# కోడ్‌ను ఉపయోగించి నగదు బదిలీ, స్టేట్‌మెంట్ సహా వివిధ సేవలను వినియోగించుకోవచ్చు.