లాక్-ఇన్ పీరియడ్ తర్వాత యెస్ బ్యాంకులో వాటా తగ్గించుకోనున్న ఎస్‌బీఐ!
ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్న ప్రైవేట్ రంగ యెస్ బ్యాంకులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన వాటా తగ్గించుకోనుంది.
న్యూఢిల్లీ: ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్న ప్రైవేట్ రంగ యెస్ బ్యాంకులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన వాటా తగ్గించుకోనుంది. గతంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యెస్ బ్యాంక్ పునర్నిర్మాణంలో భాగంగా ఎస్‌బీఐ మెజారిటీ వాటాను పొందింది. ఆర్‌బీఐ విధించిన లాక్-ఇన్ పీరియడ్ ఈ నెల 6వ తేదీతో ముగియనుండటంతో పాటు యెస్ బ్యాంకు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్న కారణంగా వాటా తగ్గించుకునే అవకాశం ఉంది. దీనిపై త్వరలో ఎస్‌బీఐ బోర్డు సమావేశం నిర్వహించనుంది. ఎంత వాటా తగ్గించుకోవాలనే అంశంపై బోర్డు నిర్ణయం తీసుకుని, అనంతరం ఆ ప్రతిపాదనను ఆర్‌బీఐ ఆమోదం కోసం పంపిస్తుంది.
పలు నివేదికల ప్రకారం ఎస్‌బీఐ దశలవారీగా యెస్ బ్యాంకులో వాటాలను తగ్గించుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. 2020లో భారీగా అప్పుల్లో ఉన్న యెస్ బ్యాంకును పునరుద్ధరించేందుకు ఆర్‌బీఐ చర్యల్లో భాగంగా ఎస్‌బీఐ 49 శాతం వాటాను కొనుగోలు చేసింది. నిబంధనల ప్రకారం మూడేళ్ల వరకు ఎస్‌బీఐ తన వాటాను 26 శాతం కంటే తక్కువ ఉండకూడదనే నిబంధన ఉంచింది. ఆ సమయంలో పలు ప్రైవేట్ దిగ్గజ బ్యాంకులు సైతం కొంత వాటాను కొన్నాయి.
గతేడాది డిసెంబర్ నాటికి ఎస్‌బీఐ తన వాటాను 26.14 శాతానికి తగ్గించుకుంది. ఈ క్రమంలో లాక్-ఇన్ పీరియడ్ ముగుస్తుండటంతో ఎస్‌బీఐ తన వాటాను మరింత తగ్గించుకోవచ్చు. ఇతర బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంక్ 2.61 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.57 శాతం, ఐడీఎఫ్‌సీ బ్యాంక్ 1 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఎల్ఐసీ 4.34 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 3.48 శాతం వాటా కొనుగోలు చేశాయి.