7-9 శాతం తగ్గనున్న భారత ఐటీ పరిశ్రమల ఆదాయం: క్రిసిల్!
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి కొనసాగుతున్న కారణంగా భారత్‌లో ఐటీ కంపెనీల ఆదాయం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 7-9 శాతం తగ్గవచ్చని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది.
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి కొనసాగుతున్న కారణంగా భారత్‌లో ఐటీ కంపెనీల ఆదాయం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 7-9 శాతం తగ్గవచ్చని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది.2022-23లో భారత ఐటీ సేవల రంగం 18-20 శాతం మేర ఆదాయ వృద్ధిని సాధించిందని, కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇది గణనీయంగా పడిపోతుందని అంచనా వేస్తున్నట్టు శుక్రవారం ప్రకటనలో వెల్లడించింది.
అంతకుముందు 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఐటీ పరిశ్రమ దాదాపు 19 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) రంగాల్లో నెలకొన్న ఒత్తిడి ఐటీ కంపెనీల రాబడి తగ్గేందుకు ప్రధాన కారణంగా ఉంటుందని క్రిసిల్ పేర్కొంది. మొత్తం ఐటీ రంగం ఆదాయంలో బీఎఫ్ఎస్ఐ నుంచే 30 శాతం వస్తోంది. కీలక దేశాల్లో ప్రతికూలత, ముఖ్యంగా అమెరికా, యూరప్‌లలోని బీఎఫ్ఎస్ఐ విభాగంలో మందగమనం దేశీయ ఐటీ సేవల కంపెనీల ఆదాయంపై ప్రభావితం చూపుతున్నాయి. దానివల్ల బీఎఫ్ఎస్ఐ నుంచి ఆదాయం సగానికి తగ్గి సింగిల్ డిజిట్‌కు పరిమితం కావొచ్చు.
ఇక, తయారీ రంగం నుంచి 14 శాతం, ఇతర రంగాల నుంచి 9-11 శాతం ఆదాయ వృద్ధిని ఐటీ పరిశ్రమ సాధించగలదని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనూజ్ సేథి అన్నారు. 2023-24లో కంపెనీలు నియామకాలకు సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటున్న నేపథ్యంలో పరిశ్రమ ఖర్చులు తగ్గుతాయి. తద్వారా అట్రిషన్ రేటు దిగి రావొచ్చని క్రిసిల్ పేర్కొంది.