కీలక మైలురాయిని దాటిన రెనాల్ట్ ఇండియా!

ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ భారత మార్కెట్లో కీలక మైలురాయిని అధిగమించింది.

Update: 2023-05-31 10:37 GMT

న్యూఢిల్లీ: ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ భారత మార్కెట్లో కీలక మైలురాయిని అధిగమించింది. గడిచిన 11 ఏళ్ల కాలంలో దేశీయ వాహన మార్కెట్లో కంపెనీ 9 లక్షల యూనిట్ల మైలురాయిని చేరుకుందని బుధవారం ప్రకటనలో తెలిపింది. 2012లో మేడ్-ఇన్-ఇండియా వాహనాలను విక్రయించడం ప్రారంభించిన రెనాల్ట్ ప్రస్తుతం ఎంట్రీ లెవల్ మోడల్ క్విడ్, కాంపాక్ట్ ఎస్‌యూవీ కైగర్, ఎంయూవీ ట్రైబర్ కార్లను తన పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉంది.

ముఖ్యంగా 2015లో కంపెనీ తీసుకొచ్చిన ఎంట్రీ లెవల్ క్విడ్ మోడల్‌తో భారత మార్కెట్లో కంపెనీ అత్యంత వేగంగా పుంజుకుంది. దీర్ఘకాల లక్ష్యంతో భారత మార్కెట్లోకి అడుగు పెట్టామని, భవిష్యత్తులో స్థానిక ఉత్పత్తికి మరింత ప్రాధాన్యత ఇస్తూ, కొత్త మోడల్ కార్లను విడుదల చేయనున్నట్టు రెనాల్ట్ ఇండియా సీఈఓ, ఎండీ వెంకట్‌రామ్ మామిళ్లపల్లె అన్నారు.

త్వరలో 90 శాతం కార్ల ఉత్పత్తిని స్థానిక పరికరాలతో తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. దేశీయ వినియోగదారుల అవసరం, ఆసక్తి, ఇష్టాలను అనుసరిస్తూ, వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఉత్పత్తులను, సేవలను అందిస్తోందని ఆయన వివరించారు. కాగా, దేశీయ మార్కెట్లో రెనాల్ట్ సంస్థ 500 డీలర్‌షిప్ సెంటర్లను, 530 సర్వీస్ టచ్‌పాయింట్లను నిర్వహిస్తోంది.

Tags:    

Similar News