ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీగా మరోసారి సందీప్ బక్షి నియామకం!

Update: 2023-09-11 16:14 GMT

ముంబై: ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా మళ్లీ సందీప్ బక్షిని నియామించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) నుంచి ఆమోదం లభించిందని బ్యాంకు వెల్లడించింది. 2023, అక్టోబర్ 4 నుంచి 2026, అక్టోబర్ 3వ తేదీ వరకు మూడేళ్ల కాలానికి ఆయన మరోసారి నియమించబడ్డారని బ్యాంకు సోమవారం ప్రకటనలో తెలిపింది.

ఆగష్టులో జరిగిన బ్యాంకు వార్షిక సర్వసభ్య సమావేశంలో సందీప్ బక్షిని కొనసాగించేందుకు షేర్‌హోల్డర్ల నుంచి అనుమతి లభించినట్టు పేర్కొంది. 2018, అక్టోబర్ నుంచి సందీప్ బక్షి బ్యాంకు ఎండీ, సీఈఓగా బాధ్యతలు చేపటారు. అంతకుముందు ఆయన ఐసీఐసీఐ గ్రూప్ హోల్‌టైమ్ డైరెక్టర్, సీఓఓగా పనిచేశారు. తొలిసారిగా 1986 నుంచి ఐసీఐసీఐ గ్రూప్‌లో ఉన్న పలు విభాగాల్లో బాధ్యతలను నిర్వహించారు.

జంషెడ్‌పూర్‌లోని జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎంబీఏ పట్టా పొందిన సందీప్ బక్షి చాలామంది సీఈఓలను తీర్చిదిద్దారు. వారిలో హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో సీఈఓ రితేష్ కుమార్, రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ అంజూజ్ గులాటి, టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ సీఈఓ, ఎండీ నీలేష్ గార్గ్ సహా పలువురు ఉన్నారు.

Tags:    

Similar News