Ratan tata: రూ.3800 కోట్లు వారికే కేటాయించిన రతన్ టాటా.. వీలునామాలో ఆసక్తికర విషయాలు!
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా(86) (Ratan Tata) గత ఏడాది అక్టోబర్ 9వ తేదీన అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా(86) (Ratan Tata) గత ఏడాది అక్టోబర్ 9వ తేదీన అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే. కేవలం లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగానే కాకుండా ఓ గొప్ప మానవతామూర్తిగా, సమాజ సేవకుడిగా రతన్ టాటా పేరుపొందారు. దీంతో ఆయన మరణానంతరం తన వేల కోట్ల ఆస్తి ఎవరికి చెందుతుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే, రూ.10 వేల కోట్ల విలువైన ఆస్తులను సోదరుడు జిమ్మీ టాటా, తను స్థాపించిన ఫౌండేషన్లకు, పెంపుడు శునకాలకు, సిబ్బంది, ఇతరులకు కేటాయిస్తూ వీలునామాలో (Ratan Tata Will) రాసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన వీలునామాలోని వివరాలు వెల్లడైనట్లు సమాచారం.
రతన్ టాటా తన ఆస్తుల సింహ భాగాన్ని ఛారిటీకి కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దాదాపు రూ.3,800 కోట్లను తన పేరుతో ఉన్న ఎండోమెంట్ ఫౌండేషన్, ట్రస్టులకు కేటాయించారు. ఇందులో టాటా సన్స్‌లో తనకున్న వాటాలు, ఇతర ఆస్తులు ఉన్నాయి. అయితే, ఈ షేర్లను విక్రయించే అవసరం వస్తే, టాటా సన్స్‌లోని ప్రస్తుతం ఉన్న వాటాదారులకే వాటిని అమ్మాలని ఆయన వీలునామాలో సూచించారని సమాచారం.
అలాగే, రూ.800 కోట్లు విలువ చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లు, స్టాక్స్‌తో పాటు ఖరీదైన వాచ్‌లు, పెయింటింగ్స్ వంటి విలువైన వస్తువులను తన సవతి సోదరీమణులు శిరీన్ జజీభోయ్, దియానా జజీభోయ్‌లకు రాశారు. టాటా గ్రూప్ మాజీ ఉద్యోగి, రతన్‌కు అత్యంత సన్నిహితుడైన మోహిన్ ఎం.దత్తాకు కూడా రూ.800 కోట్ల విలువైన కేటాయించినట్లు సమాచారం. ఇక జుహూలోని తన బంగ్లాలో కొన్ని షేర్లు, వెండి వస్తువులు, బంగారు ఆభరణాలను సోదరుడు జిమ్మీ నావల్ టాటాకు కేటాయించారు. అలీబాగ్‌లోని బంగ్లా, మూడు పిస్టోల్స్‌ను తన ప్రియ మిత్రుడు మెహిల్ మిస్త్రీకి రతన్ టాటా రాశారు.
ఇక రతన్ టాటాకు మూగజీవాలపై ఉండే ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలోనే తన పెంపుడు జంతువుల సంరక్షణ కోసం రూ.12 లక్షల ఫండ్‌ను సమకూర్చి, ప్రతి మూడు నెలలకు రూ.30వేల చొప్పున వాటి కోసం వినియోగించాలని పేర్కొన్నారు. అలాగే, రతన్ టాటా జీవితంలో అత్యంత సన్నిహితుడు, కేర్ టేకర్, యువ మిత్రుడైన శంతను నాయుడుకి (Shantanu Naidu) గతంలో ఇచ్చిన విద్యార్థి రుణాన్ని మాఫీ చేశారు. అలాగే, తన పొరుగింట్లో ఉన్న జేక్ మాలిటే అనే వ్యక్తికి రూ.23 లక్షలు అప్పుగా ఇచ్చి, దాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు వీలునామాలో పేర్కొన్నారు. ఇక రతన్ టాటాకు విదేశాల్లో కూడా రూ.40 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈ వీలునామాను పరిశీలించి ఆస్తులను కేటాయించాలని ఇప్పటికే బాంబే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు కాగా.. ఆ ప్రక్రియ పూర్తి అయ్యే సరికి మరో 6 నెలలు పడుతుందని సమాచారం.