GOLD: బంగారం ఉత్పత్తి చేసే PSUలను ప్రవేటీకరించండి: వేదాంత ఛైర్మన్
భారతదేశంలో బంగారాన్ని ఉత్పత్తి చేసే రెండు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసినట్లయితే ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద బంగారం ఉత్పత్తి దారుగా మారుతుందని మైనింగ్ దిగ్గజం వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్ అన్నారు.
దిశ, బిజినెస్ బ్యూరో: భారతదేశంలో బంగారాన్ని ఉత్పత్తి చేసే రెండు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసినట్లయితే ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద బంగారం ఉత్పత్తి దారుగా మారుతుందని మైనింగ్ దిగ్గజం వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్ అన్నారు. దేశంలో అవసరాల కోసం బంగారాన్ని ఇతర దేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. దాదాపు 99.9 శాతం దిగుమతుల పైనే ఆధారపడ్డాం. అయితే దేశంలో బంగారం ఉత్పత్తిని పెంచడానికి భారీ పెట్టుబడులు పెట్టి, ప్రధాన ఉత్పత్తిదారుగా, ఉపాధిని సృష్టించడానికి సిద్ధంగా ఉన్నామని అగర్వాల్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా బంగారం ఉత్పత్తిలో భారత్ అగ్రగామిగా మారడానికి దేశంలో ఉన్న రెండు ఏకైక బంగారం ఉత్పత్తిదారులైన భారత్ గోల్డ్ మైన్స్, హట్టి గోల్డ్ మైన్స్‌లను ప్రభుత్వం ప్రైవేటీకరించడమే ఉత్తమ మార్గం అని ఆయన వివరించారు.
ముఖ్యంగా ప్రైవేటీకరణ అనేది మూడు షరతులతో జరగాలని కూడా సూచించారు. రిట్రెంచ్‌మెంట్ ఉండకూడదని, ఉద్యోగులకు కొంత ఈక్విటీ ఇవ్వాలని అలాగే ఆస్తులను వేర్వేరు భాగాలుగా విభజించే ప్రయత్నం చేయకుండా యథాతథంగా ప్రక్రియను చేపట్టాలని అన్నారు. ఇంకా, దేశంలోనే ఏకైక రాగి గనుల సంస్థ అయిన హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో ప్రభుత్వం తన ఈక్విటీని కూడా ఉపసంహరించుకోవాలని కూడా అగర్వాల్ అన్నారు. ఇటీవల వచ్చిన డేటా ప్రకారం, 2023-24లో భారతదేశ బంగారం దిగుమతులు 30 శాతం పెరిగి USD 45.54 బిలియన్లకు చేరుకున్నాయి. అంతకుముందు 2022-23లో దిగుమతులు USD 35 బిలియన్లుగా ఉన్నాయి.