ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది: పీయూష్ గోయల్
దేశ ఆర్థిక వృద్ధి పటిష్టంగా ఉంది, ద్రవ్యోల్బణం కూడా అదుపులోనే ఉంది.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నందున భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) తదుపరి సమావేశాల్లో కీలక వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభిప్రాయపడ్డారు. గతేడాది ఫిబ్రవరిలో రెపో రేటును 6.5 శాతం నిర్ణయించిన ఆర్‌బీఐ, అప్పటినుంచి రేట్లను స్థిరంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 'ప్రస్తుతం దేశ ఆర్థిక వృద్ధి పటిష్టంగా ఉంది, ద్రవ్యోల్బణం కూడా అదుపులోనే ఉంది. భారత పదేళ్ల సగటు ద్రవ్యోల్బణం కూడా 5 శాతం నుంచి 5.5 శాతం మధ్యే ఉందని' మంత్రి తెలిపారు. దశాబ్దంలోనే ఉత్తమపనితీరు కారణంగా వడ్డీ రేటు దిగొచ్చింది. ప్రస్తుతం ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉందని మంత్రి వివరించారు. వచ్చే ద్రవ్య పరపతి విధాన(ఎంపీసీ) సమీక్షలో లేదా ఆ తర్వాత సమావేశంలో వడ్డీ రేట్లను తగ్గించవచ్చని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించడ వల్ల కార్పొరేట్, పర్సనల్ రుణాల ఖర్చుల దిగి రానున్నాయి. తద్వారా ప్రజలపై ఈఎంఐ భారం తగ్గుతుంది.