‘పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే ఆలోచనలో చమురు కంపెనీలు’

అంతర్జాతీయంగా చమురు ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి.

Update: 2024-09-12 08:13 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా చమురు ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. ఇదే ధోరణి మరికొంత కాలం కొనసాగినట్లయితే దేశంలో ప్రజలకు ఉపశమనం కలిగించేలా పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వరంగ ఇంధన కంపెనీలు తగ్గించే అవకాశం ఉన్నట్లు చమురు కార్యదర్శి పంకజ్ జైన్ తెలిపారు. ప్రస్తుతం, కంపెనీలు ఆ దిశగా ఆలోచన చేస్తున్నాయని ఆయన అన్నారు. గతంలో ద్రవ్యోల్బణం ప్రభావం, చమురు ధరల పెరుగుదలతో ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. పెరిగిన ధరలతో ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డారు. అయితే ఇటీవల ఈ రెండు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. గత కొంత కాలంగా లిబియా చమురు అంతర్జాతీయ మార్కెట్లోకి రావడంతో చమురు ధరలు క్రమంగా తగ్గుతున్నాయి.

ఈ తగ్గింపు ధోరణి ఇలాగే కొనసాగినట్లయితే దేశీయ ఇంధన ధరలను తగ్గించాలని సంస్థలు భావిస్తున్నాయి. OPEC+ నుండి ఉత్పత్తిని పెంచాలని, తక్కువ ధరకు చమురు అందిస్తున్న రష్యా వంటి సరఫరాదారులతో ముడి చమురు కొనుగోళ్లను పెంచడానికి భారత్ ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టింది. చమురు ధరలు ఇటీవల దాదాపు మూడు సంవత్సరాల కనిష్టానికి పడిపోయాయి, ఇంధన మార్కెటింగ్ కంపెనీల లాభదాయకత క్రమంగా పెరుగుతుంది. రాబోయే రోజుల్లో మహారాష్ట్ర, హర్యానా వంటి కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దానికి ముందుగానే ఇంధన ధరలను తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది.


Similar News