Paytm: జొమాటో చేతికి పేటీఎం ఎంటర్‌టైన్‌మెంట్ టికెటింగ్ వ్యాపారం
రూ. 2,048 కోట్లకు వ్యాపారాన్ని బదిలీ చేయనున్నట్టు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.
దిశ, బిజినెస్ బ్యూరో: తన సినిమా, ఈవెంట్స్ టికెటింగ్ వ్యాపారాన్ని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు విక్రయించనున్నట్టు పేటీఎం బుధవారం ప్రకటనలో వెల్లడించింది. రూ. 2,048 కోట్లకు వ్యాపారాన్ని బదిలీ చేయనున్నట్టు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. ఇకమీదట ప్రధాన చెల్లింపులు, ఆర్థిక సేవల వ్యాపారాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నట్టు కంపెనీ పేర్కొంది. నగదు రహిత, రుణ ప్రాతిపదికన రూ. 2,048 కోట్లకు ఈ ఒప్పందం ఖరారైంది. ఈ బదిలీలో భాగంగా ఎంటర్‌టైన్‌మెంట్ టికెటింగ్ వ్యాపారంలో దాదాపు 280 మంది ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ ఒప్పంద బదిలీ ప్రక్రియకు 12 నెలల సమయం పడుతుందని, ఈ వ్యవధిలో సినిమా, క్రీడలు, ఈవెంట్‌లతో సహా వివిధ ఎంటర్‌టైన్‌మెంట్ వ్యాపారానికి సంబంధించి బుకింగ్‌లు పేటీఎం యాప్‌లో అందుబాటులో ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తాము ఎంటర్‌టైన్‌మెంట్ టికెటింగ్ వ్యాపారాన్ని ప్రారంభించాం. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాన వ్యాపార వృద్ధిపై దృష్టి సారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేటీఎం ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.