Paytm: యూపీఐ ఇంటర్నేషనల్ ఫీచర్ ప్రారంభించిన పేటీఎం
ఈ సదుపాయం యూఏఈ, ఫ్రాన్స్, మారిషస్, సింగపూర్, భూటాన్, నేపాల్‌లలో చేసేందుకు వీలుంటుందని కంపెనీ మంగళవారం ప్రకటించింది.
దిశ, బిజినెస్ బ్యూరో: డిజిటల్ చెల్లింపుల కంపెనీ పేటీఎం దేశీయ ట్రావెలర్ల కోసం యూపీఐ ఇంటర్నేషనల్ ఫీచర్‌ను ప్రారంభించింది. అంతర్జాతీయ ఎంపిక చేసిన దేశాల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) లావాదేవీలు చేసేందుకు ఈ ఫీచర్ పనిచేస్తుంది. ఈ సదుపాయం యూఏఈ, ఫ్రాన్స్, మారిషస్, సింగపూర్, భూటాన్, నేపాల్‌లలో పేటీఎం యాప్ ద్వారా నగదు రహిత చెల్లింపులు చేసేందుకు వీలుంటుందని కంపెనీ మంగళవారం ప్రకటించింది. మొబైల్ చెల్లింపుల్లో భాగంగా యూపీఐ ఇంటర్నేషనల్‌ను విస్తరించడం సంతోషంగా ఉంది. దీనివల్ల విదేశీ ప్రయాణాలు మరింత సౌకర్యంగా ఉంటాయని, రాబోయే హాలిడే సీజన్‌లో ఈ ఫీచర్ గేమ్ చేంజర్‌గా ఉంటుందని పేటీఎం ప్రతినిధి చెప్పారు. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకునేందుకు కస్టమర్లు తమ బ్యాంక్ ఖాతాను పేటీఎం యాప్‌కి లింక్ చేయాలని, విదేశాలకు వెళ్లిన తర్వాత యూపీఐ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఉపయోగించవచ్చని కంపెనీ వివరించింది. యూపీఐ ఇంటర్నేషనల్ ఫీచర్‌ను 1-90 రోజుల మధ్య కాలవ్యవధిని ఎంచుకోవాల్సి ఉంటుందని పేటీఎం పేర్కొంది. భద్రతా ప్రయోజనాల కోసం ఈ ఫీచర్‌ని ఎప్పుడైనా డీయాక్టివేట్ చేయవచ్చు. అదేవిధంగా యాప్‌లో లావాదేవీ జరిగే సమయంలో అప్పటికి ఉన్న విదేశీ మారకపు రేట్ల ఆధారంగా మాత్రమే రుసుములను వర్తిస్తాయని వెల్లడించింది.