కొత్త ఓలా ఎస్1 ఎయిర్ ధర రూ. 84,999!

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన సరికొత్త స్కూటర్‌ను గురువారం విడుదల చేసింది.

Update: 2023-02-09 17:04 GMT

బెంగళూరు: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన సరికొత్త స్కూటర్‌ను గురువారం విడుదల చేసింది. రూ. 84,999 ప్రారంభ ధరతో తీసుకొచ్చిన మూడు వేరియంట్లలో ఓలా ఎస్1 ఎయిర్ స్కూటర్‌ను కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎస్1, ఎస్1 ప్రోకు అదనంగా ఎస్ ఎయిర్‌ను తీసుకొచ్చింది. దీంతో ఓలా ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోలో మొత్తం మూడు స్కూటర్లు ఉండనున్నాయి.

కొత్తగా తీసుకొచ్చిన వేరియంట్ 2 కిలోవాట్ అవర్ బ్యాటరీతో వస్తుంది. ఇదే బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఎస్1 వేరియంట్‌ను కూడా కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. దాని ధర రూ. 99,999గా ఉంది. ఎస్1 వేరియంట్ ఒకసారి చార్జ్ చేసిన తర్వాత 91 కిలోమీటర్ల వరకు ప్రయాణించడానికి వీలవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పటికే కంపెనీ అందిస్తున్న 3కిలోవాట్ అవర్ ఎస్1 స్కూటర్ ఒకసారి చార్జింగ్‌తో 141 కిలోమీటర్లు వెళ్తుంది. ఇది గరిష్ట వేగం గంటకు 95 కిలోమీటర్లు వెళ్లగలదు.

కొత్తగా తీసుకొచ్చిన ఎస్1 ఎయిర్ మూడు బ్యాటరీ ఎంపికల్లో లభిస్తుంది. 2 కిలోవాట్ అవర్ ఒకసారి చార్జ్ చేస్తే 85 కిలోమీటర్లు, 3 కిలోవాట్ అవర్ బ్యాటరీతో వచ్చే వేరియంట్ 125 కిలోమీటర్లు, 4 కిలోవాట్ అవర్ 165 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఈ మూడు వేరియంట్ల గరిష్ట వేగం 85 కిలోమీటర్లు కాగా, గతంలో 2.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ స్కూటర్ కోసం బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు ఎలాంటి అదనపు చెల్లింపు లేకుండా 3 కిలోవాట్ అవర్ బ్యాటరీతో వచ్చే స్కూటర్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది.

Tags:    

Similar News